రాయలసీమలో తెలుగుదేశం పార్టీ ఇంకా పూర్తి స్థాయిలో పుంజుకున్నట్లు కనిపించడం లేదు. గత రెండు ఎన్నికల నుంచి రాయలసీమలో వైసీపీదే పైచేయి అవుతుంది. అదేదో సీమ మొత్తం వైసీపీ కంచుకోట మాదిరిగా అయిపోయింది. 2014 ఎన్నికల్లో టిడిపి గాలి ఉన్నా సరే సీమలో మాత్రం వైసీపీ హవా నడిచింది. సీమలోని నాలుగు జిల్లాల్లో ఒక్క అనంతపురంలోనే టిడిపి పైచేయి సాధించింది. మిగిలిన మూడు జిల్లాల్లో వైసీపీదే హవా.

ఇక 2019 ఎన్నికల్లో ఏం జరిగిందో చెప్పాల్సిన పని లేదు. సీమలో మొత్తం 52 సీట్లు ఉంటే వైసీపీ 49 సీట్లు గెలుచుకోగా, కేవలం టిడిపికి 3 సీట్లు మాత్రమే వచ్చాయి. అంటే సీమలో టిడిపి పరిస్తితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అయితే ఎన్నికలై రెండేళ్ళు దాటాయి. ఈ క్రమంలో పలువురు వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరుగుతున్నట్లు కనిపిస్తోంది.

దీంతో కొన్ని నియోజకవర్గాల్లో టిడిపికి పుంజుకునే అవకాశం దక్కింది. అయితే ఆ అవకాశం టిడిపి పూర్తిగా ఉపయోగించుకోలేకపోతుందని తెలుస్తోంది. ఏదో ఒక్క అనంతపురంలో తప్ప, మిగిలిన జిల్లాలో టిడిపి నాయకులు పికప్ కాలేకపోతున్నారు. ఆ జిల్లాల్లో వైసీపీపై వ్యతిరేకత ఉన్నా సరే దాన్ని టిడిపి ఇంచార్జ్‌లు సరిగ్గా ఉపయోగించుకుని పికప్ అవ్వలేకపోతున్నారు. అసలు వైసీపీకి ప్రత్యామ్నాయం అని ప్రజలకు వారు నిరూపించుకోలేకపోతున్నారు.

దాని వల్ల ఆయా నియోజకవర్గాల ప్రజలకు టిడిపిపై ఇంకా నమ్మకం రావడం లేదు. వైసీపీ ఎమ్మెల్యేపై వ్యతిరేకత ఉన్నా సరే, జగన్‌ని చూసి ఇంకా వారు వైసీపీకే సపోర్ట్ ఇచ్చేలా కనిపిస్తున్నారు. కానీ అలాంటి ప్రజలని టిడిపి నేతలు తమవైపుకు తిప్పుకోలేకపోతున్నారు. దీని వల్ల సీమలో టిడిపి ఇంకా వెనుకబడే ఉంది. అయితే రానున్న రెండేళ్లలో టిడిపి నేతలు పికప్ అయ్యి, పార్టీని లైన్‌లో పెడతారేమో చూడాలి.

Discussion about this post