విశాఖ ఏజెన్సీ అన్నది వైసీపీకి ఇప్పటిదాక పట్టుగొమ్మలా ఉంది. వైసీపీకి 2014, 2019 రెండు ఎన్నికల్లోనూ ఎంపీ, ఎమ్మెల్యే సీట్లను గిరిజనం కట్టబెట్టారు. అదే విధంగా మావోయిస్టులు కూడా నాడు వైసీపీ పట్ల కొంత సానుకూలంగా ఉన్నారన్న భావన ఉండేది. అలాంటిది ఇపుడు సీన్ ఒక్క సారిగా మారిపోయింది. బాక్సైట్ తవ్వకాలకు వైసీపీ సర్కార్ అనుమతులు ఇచ్చేసిందని టీడీపీ సహా వామపక్ష పార్టీలు గట్టిగానే చెబుతున్నాయి. ఏకంగా కొంతమంది కాంట్రాక్టర్ల పేర్లు కూడా చెబుతూ ఇది వైసీపీ పెద్దలు చేయిస్తున్న నిర్వాకమని కూడా టీడీపీ అంటోంది. లైట్ రైట్ ఖనిజ తవ్వకాల ముసుగులో ఎంతో విలువ చేసే బాక్సైట్ తవ్వకాలను కూడా చేస్తున్నారని అంటున్నారు. దీని వల్ల గిరిజనం పూర్తిగా నష్టపోతారని చెబుతున్నారు. వారి పర్యావరణానికి, ఉపాధికి, భవిష్యత్తుకు కూడా హాని కలుగుతుందని అంటున్నారు.
ఈ పరిణామాల నేపధ్యంలో విశాఖ మన్యంలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. వైసీపీ పట్ల విపరీతమైన అభిమానం చూపించే గిరిజనులు కూడా అనుమానిస్తున్నారు. అయితే పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి అలాంటిది ఏమీ లేదని, బాక్సైట్ తవ్వకాలు కనుక జరిగితే మాత్రం తాము కచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీస్తామని, అవసరం అనుకుంటే తాను ఎమ్మెల్యే పదవీ రాజీనామా చేస్తాను అని కూడా అంటున్నారు. మరో వైపు టీడీపీ నిజ నిర్ధారణ బృందాన్ని పోలీసులు అడ్దుకోవడం వంటివి చూసినపుడు అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఏమీ లేకపోతే విపక్ష నాయకులను మైనింగ్ ఏరియాల వద్దకు పంపవచ్చు కదా అన్నది కూడా ఏజెన్సీలో చర్చగా ఉంది.
ఇవన్నీ పక్కన పెడితే ఈసారి రాజకీయం ఏజెన్సీలో మారుతుంది అంటున్నారు. దానికి బాక్సైట్ తో పాటు ఇతర కారణాలు కూడా ఉన్నాయి. ఏజెన్సీలో అభివృద్ధి అన్నది లేకుండా పోయింది. వారికి భారీ ఎత్తున ఉపాధి కల్పిస్తామని వైసీపీ హామీ ఇచ్చింది. ఇపుడు చూస్తే పర్యాటకరంగం కూడా పూర్తిగా దెబ్బతినిపోయింది. ఏజెన్సీ ఉత్పత్తులకు సరైన మార్కెటింగ్ లేదు. ఇంకో వైపు చూస్తే కనీస వైద్య సదుపాయాలు కూడా ఏజెన్సీలో లేవు. కరోనా వేళ ఆ సంగతి ఇంకా బాగా స్పష్టం కావడంతో గిరిజనులు మండిపడుతున్నారు. ఇక ప్రజా ప్రధినిధులు కూడా మైదాన ప్రాంతాలలోనే ఉంటూ తమ గోడుని అసలు పట్టించుకోవడం లేదు అన్న వేదన ఉంది.
అధికారుల అవినీతి కూడా ఏజెన్సీ గిరిజనం పాలిట శాపంగా మారుతోంది. ఈ నేపధ్యంలో టీడీపీ పట్ల ఈసారి మొగ్గు చూపిస్తారు అన్న మాట అయితే ఉంది. ఇప్పటికే మాజీ మంత్రి కిడారి శ్రావణ్ ఏజెన్సీ ప్రాంతంలో పర్యటిస్తూ పార్టీ పటిష్టతకు గట్టిగానే కృషి చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. మరి బాక్సైట్ అంశం అత్యంత కీలకమైనది. ఇది కనుక పాశుపతాశ్రంగా మారితే మాత్రం ఏజెన్సీలో ఫ్యాన్ రెక్కలు ముక్కలు కాక తప్పదని అంటున్నారు.
Discussion about this post