తెలుగుదేశం పార్టీకి గోదావరి జిల్లాలు కంచు కోటలు అంటారు. ఎటువంటి సమయంలోనైనా కూడా ఈ జిల్లాలు టీడీపీ వైపే ఉన్నాయి. ఇక తూర్పు గోదావరి జిల్లాకు గుండెకాయ లాంటి కాకినాడలో టీడీపీ జెండా ఇంతకాలం ఎగురుతూ వచ్చింది. బలమైన నాయకులు ఆ పార్టీకి ఉన్నారు. పైగా ఏకపక్ష విజయాలను నమోదు చేసి 2017లో కాకినాడ కార్పోరేషన్ పదవిని టీడీపీ గెలుచుకుంది. మొత్తం 48 డివిజన్లకు గానూ టీడీపీకి 32 నాడు దక్కాయి. వైసీపీకి కేవలం 10 మంది కార్పోరేటర్ల బలం ఉంది. బీజేపీకి మూడు, ఇండిపెండెంట్లకు మూడు వచ్చాయి. ఇప్పటిదాకా కాకినాడలో టీడీపీ హావాయే సాగేది.

అలాంటిది రెండవ మేయర్ కి ఎన్నికల్ జరిగితే బలమే లేని వైసీపీ ఏకంగా ఎగరేసుకుపోయింది. మరో వైపు ఈ ఎన్నికల్లో పాలు పంచుకోమని టీడీపీ చేతులెత్తేసింది. దీనిని ఎలా అర్ధం చేసుకోవాలి అని తమ్ముళ్లు అంటున్నారు. లెక్కల ప్రకారం చూస్తే టీడీపీ ఎలాంటి ఆయాసం లేకుండా రెండవ డిప్యూటీ మేయర్ గెలుచుకోవాల్సిందే.కానీ టీడీపీకే చెందిన మెజారిటీ కార్పోరేటర్లు వైసీపీ వైపుగా రావడంతోనే ఈ విజయం సాధ్యపడింది అంటున్నారు. అంటే ఫిరాయింపులు అన్న మాట. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు వర్సెస్ మేయర్ సుంకర పావని వర్గాలుగా పార్టీ నేతలు విడిపోయి ఆధిపత్య రాజకీయాలు చేసుకుంటున్నారు. దీంతో పార్టీని సర్వనాశనం చేసేశారు.

వైసీపీకి బలం లేకపోయినా ఫిరాయింపులతో ఇక్కడ టీడీపీని టార్గెట్ చేస్తోంది. దాంతో పసుపు జాతకం కాకినాడ వేదికగా వెలవెలపోయింది. ఇక మరో ఏడాదితో ఎన్నికలు జరగడం ఖాయం. ఇప్పటి పరిస్థితి చూస్తూంటే కచ్చితంగా కాకినాడలో వైసీపీ గెలుపు ఖాయమనే అంటున్నారు. మరి రాజకీయంగా అత్యంత ముఖ్యమైన స్థానం అయిన కాకినాడలో టీడీపీ ఇలా తగ్గిపోతూంటే 2024 ఎన్నికల మీద ఆశలు ఎందుకు ఉంటాయని తమ్ముళ్ళే అంటున్నారు. మొత్తానికి తూర్పు గోదావరి జిల్లాలో రాజకీయం చూస్తే కనుక సైకిల్ పార్టీకి మరిన్ని పంక్చర్లు ముందు ముందు తప్పవనే అంటున్నారు.
Discussion about this post