జగన్ అంటేనే జగ మొండి అని చెప్పుకుంటారు. అయితే ఇది విపక్షాలు చేసే విమర్శగానో మరోటిగానే ఇంతకాలం జనం కూడా చూశారు. కానీ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక గత రెండేళ్లలో జరిగిన అనేక పరిణామాలను కనుక చూస్తే ఆయనలోని మొండితనం ఏంటో జనాలకు తేటతెల్లంగా అర్ధమవుతూ వస్తోంది. ఈ మధ్యనే టెన్త్ ఇంటర్ పరీక్షల విషయంలో జగన్ సర్కార్ ఎంత పట్టుదలకు వెళ్ళిందో అందరూ చూశారు. అదే విధంగా మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో వివాదాలు తలెత్తినపుడు కూడా జగన్ పట్టు విడవకుండా కోర్టులను ఆశ్రయించడం వెనక ఆయన పట్టుదల ఏంటో లోకం చూసింది.
సరే అవన్నీ కొంత వరకూ ప్రభావం చేసే అంశాలే. కానీ ఇపుడు జల వివాదం అలాంటిది కాదు, ఏపీ తెలంగాణాల మధ్యన చిన్నగా మొదలై ఇదిపుడు కార్చిచ్చుగా మారుతోంది. నీరు కాదు నిప్పు అనేలా ఈ వ్యవహారం ఉంది. క్రిష్ణా జలాలలో ఏపీకి రావాల్సిన వాటాను కూడా దక్కనీయకుండా చేయాలని తెలంగాణా పట్టుదలగా ఉంది. యాభై శాతం వాటా కోరుతోంది. అంతే కాదు, కేసీయార్ సర్కార్ జీవోను జారీ చేసి మరీ శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నీటిని తోడేస్తోంది. దీని వల్ల 854 అడుగుల వరకూ నీరు స్టోరేజ్ అన్నది కుదరని వ్యవహారంగా ఉంది. ఇక రాయలసీమ పూర్తిగా ఎండిపోతోంది. రైతులు గగ్గోలు పెడుతున్నారు.
కానీ ఏపీ సర్కార్ లో మాత్రం చలనం కనిపించడం లేదు. తాపీగా కేంద్రానికి లేఖలు రాస్తూ కూర్చుంది అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిజానికి ఇది తాపీగా ఉండాల్సిన సమయం కాదు, ఈ విషయంలో ఏపీలోని అన్ని రాజకీయ పక్షాలను కలుపుకుని కేంద్రం వద్దకు జగన్ తీసుకెళ్ళాలి. ఏపీకి సీఎం గా జగన్ కనీస బాధ్యత ఇది. అఖిల పక్ష సమావేశం పెట్టి ముందుగా అన్ని పార్టీల నుంచి అభిప్రాయాన్ని కూడా సేకరించాలి. వారి మద్దతు కూడా కూడగట్టాలి. తెలంగాణాలో అన్ని రాజకీయ పార్టీలు ఒకే మాట మీద ఉన్నట్లుగా కనిపిస్తోంది.
ఒకవేళ అలా కాదనుకున్నా అది ఎగువ రాష్ట్రం, అన్ని రకాలైన అడ్వాంటేజెస్ ఆ రాష్ట్రానికి ఉన్నాయి కాబట్టి పోయేది ఏమీ లేదు. కానీ ఏపీ దిగువ రాష్ట్రం అన్ని విధాలుగా నష్టపోతున్న రాష్ట్రం. జగన్ మాత్రం ఒంటెద్దు పోకడలతో ఉంటే కుదిరే వ్యవహారం కాదు. కోట్లాది జనాలకు సంబంధించిన సమస్య విషయంలో జగన్ ఏపీకి ఒక తండ్రిగా, పెద్దన్నగా అన్ని పార్టీలను కలుపుకుని పోవాల్సిన అవసరం ఉంది అని అంతా అంటున్నారు. ఈ విషయంలో జగన్ కనుక తాత్సారం చేస్తే నష్టపోయేది ఏపీ, దానితో పాటే జగన్ రాజకీయం కూడా అన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి.
Discussion about this post