విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ఒక వైపు జోరుగా ప్రయత్నాలు జరిగిపోతున్నాయి. ఇపుడున్న స్థితిలో స్టీల్ ప్లాంట్ ను రక్షించాల్సిన అతి ముఖ్య బాధ్యత రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ మీదనే ఉంది అన్నది నిజం. కేంద్రం మీద గట్టి వత్తిడి తెచ్చి ఏపీకి ప్రౌడ్ గా ఉన్న స్టీల్ ప్లాంట్ ని కాపాడుకోవాలి. అదే విషయం మీద అధికార పార్టీని టీడీపీ నేతలు కార్నర్ చేస్తున్నారు. విజయసాయిరెడ్డి ఈ ఏడాది ఫిబ్రవరిలో పాదయాత్ర చేపట్టారు. నాడు జీవీఎంసీ ఎన్నికలు ఉండడం చేత ఆయన స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కానివ్వమని పెద్ద మాటలు చెప్పారని అంటున్నారు. అయితే ఇపుడు మాత్రం ఆయన పట్టించుకోవడం లేదని విశాఖ జిల్లా టీడీపీ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాస్ విమర్శిస్తున్నారు.
మరో వైపు సీపీఐ సహా ఇతర విపక్షాలు కూడా వైసీపీనే నిందిస్తున్నాయి. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అయితే ఏదో మొక్కుబడిగా కేంద్రానికి ప్రేమ లేఖలు రాసినట్లుగా రాస్తే స్టీల్ సమస్య పరిష్కారం కాదని జగన్ని గట్టిగానే హెచ్చరించారు. ఈ విషయంలో అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. పోరాటం అంతా ఢిల్లీలోనే చేయాలని, దానికి నాయకత్వం వహించాల్సింది ముఖ్యమంత్రి జగనే అని కూడా అంటున్నారు. ఇంకో వైపు చూసుకుంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం మీద టీడీపీ జిల్లా ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాస్ ఇప్పటికే నిరాహార దీక్ష చేశారు.
చంద్రబాబు విశాఖ వచ్చి మరీ సంఘీభావం తెలిపారు. ఆ విధంగా టీడీపీ ఈ పోరాటం విషయంలో తన చిత్తశుద్ధిని చాటుకుంది. మరో వైపు వైసీపీ మాత్రం అడ కత్తెరలో పోక చెక్కలా ఇరుక్కుపోయింది అంటున్నారు. కేంద్రాన్ని ఏమీ అనలేక ఇక్కడ ఉక్కు సెగను తట్టుకోలేక సతమతం అవుతోంది అంటున్నారు. మరి స్టీల్ ప్లాంట్ నిలబడితే ఆ పొలిటికల్ క్రెడిట్ టీడీపీకే వస్తుంది. ఒకవేళ ప్రైవేట్ అయితే కచ్చితంగా విశాఖ సహా ఉత్తరాంధ్రా జిల్లాల ప్రజల దృష్టిలో వైసీపీ మెయిన్ విలన్ అవుతుంది అంటున్నారు. అది వచ్చే ఎన్నికల్లో జగన్‌కు పెద్ద ఎదురు దెబ్బే అవుతుంది.
Discussion about this post