ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అధికారంలోకి వస్తుందా ? వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా చంద్రబాబు నవ్యాంధ్ర సీఎంగా పగ్గాలు చేపడతారా ?.. ఇవే ప్రశ్నలకు టీడీపీ అనుకూల మీడియా సహా .. ఆపార్టీ నేతలు అవునని అంటున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం వారు కొన్ని అంచనాలు కూడా చెబుతున్నారు. జగన్ సర్కా రు వైఖరిపై మధ్య తరగతి ప్రజలు గుస్సాగా ఉన్నారని.. సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతున్నామని చెబుతున్నా.. మధ్య తరగతికి జగన్ సర్కారు చేస్తున్నది ఏమీ లేదని.. అందుకే ఈ వర్గం ఆశలు టీడీపీ పైనే ఉన్నాయని అంటున్నారు. అదే సమయంలో రాజధాని అమరావతిపై మెజారిటీ ప్రజలు ఆశలతోనే ఉన్నారని.. అందుకే వారు కూడా తమకే జై కొడుతున్నారని చెబుతున్నారు.

ఇక, జగన్ గ్రాఫ్ కూడా ఇటీవల కాలంలో తగ్గిపోయినట్టు ఓ సర్వేలో ఇటీవల వెల్లడి కావడం కూడా.. టీడీపీకి అనుకూలంగా ఉందని.. చెబుతున్నారు. మరీ ముఖ్యంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెబుతున్నప్పటికీ.. దీనివల్ల రాష్ట్రానికి ఉపయోగం ఏంటనేది మేధావులు కూడా ప్రశ్నిస్తున్నారని. అదే తమ హయాంలో అయితే.. సంక్షేమాన్నీ, అభివృద్ధిని కూడా ఒకే సమయంలో తీసుకువెళ్లామని.. ఇప్పుడు అభివృద్ధి విషయంలోను, పెట్టుబడుల కల్పన విషయంలోనూ.. ఉపాధి విషయంలోనూ రాష్ట్రం తీవ్రంగా ఇబ్బంది పడుతోందని.. ఇది తమకు గెలిచే అవకాశాన్ని మెండుగా కల్పిస్తోందని టీడీపీ నేతలు చెబుతున్నారు.మరోవైపు.. వైసీపీలో నేతలు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్న విషయాన్ని టీడీపీ నేతలు.. అంతర్గత చర్చ ల్లో ప్రధానంగా తీసుకువస్తున్నారు. ప్రదానంగా జగన్ అధికారంలోకి వచ్చేందుకు దోహదపడిన రెడ్డి సామాజిక వర్గమే ఇప్పుడు జగన్‌పై అసంతృప్తితో ఉందని.. ఈ వర్గానికి మేలు చేసేలా తాము వ్యూహాలు సిద్ధం చేసుకుంటే.. టీడీపీవైపు సగం మంది మళ్లినా.. తమకు గెలుపు అవకాశాలు మెరుగు పడతాయని టీడీపీ నాయకులు అంచనా వేస్తున్నారు.

ఈ పరిణామాలకు తోడు.. యువతను ప్రధానంగా ఎంకరేజ్ చేయడం ద్వారా.. తమకు అధికారం దక్కుతుందనే అంచనాలు వేసుకుంటున్నారు. మరి టీడీపీ అంచనాలు సక్సెస్ అవుతాయో.. లేదో చూడాలి. ఇప్పటి వరకు అయితే.. టీడీపీ నిజానికి అంతర్గత పోరుతో అల్లాడుతున్న విషయం తెలిసిందే. దీనిని అధిగమించిన సక్సెస్ అందిపుచ్చుకునేందుకు రెండేళ్ల సమయంలో సరిపోయినా.. ఆ దిశగా కార్యాచరణ ప్రధానంగా ముందుకు తీసుకువెళ్లాలని అంటున్నారు పరిశీలకులు.
ReplyForward |
Discussion about this post