మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన విశాఖ జిల్లా పాయకరావు పేట వైసీపీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు ఈసారి ఓడిపోతారా. అసలు ఆయనకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తారా. ఇవే జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా ఉన్నాయి. బాబూరావు జిల్లా పరిషత్ పాలనాధికారిగా ఉంటూ వైఎస్సార్ పిలుపు మేరకు రాజకీయ ఎంట్రీ ఇచ్చారు. ఆయన 2009 ఎన్నికల్లో పాయకరావు పేట నుంచి గెలిచి కాంగ్రెస్ కి కొత్త బలం తీసుకువచ్చారు. ఎందుకంటే పాయకరావుపేట ఎపుడూ టీడీపీకి కంచుకోటగానే ఉంటూ వచ్చింది. అలాంటి సీట్లో ఫస్ట్ టైమ్ లోనే గెలవడం కాదు, ఆ తరువాత జగన్ పార్టీ తరఫున 2012 ఉప ఎన్నికల్లోనూ గెలిచారు. 2019లో మూడవసారి గెలిచి తానేంటో నిరూపించుకున్నారు. అయితే ఆయన మీద జనంలో వ్యతిరేకత ఎక్కువగా ఉందని తాజాగా సర్క్యులేట్ అవుతున్న ఒక సర్వే చెబుతోంది.

అది ఎంతవరకూ నిజమో తెలియదు కానీ టీడీపీ వారు మాత్రం ఈసారి అక్కడ జెండా పాతేది తామేనని హుషార్ చేస్తున్నారు. అనితకు మళ్ళీ ఎమ్మెల్యే అయ్యే చాన్స్ వచ్చిందని కూడా ఆమె వర్గం అపుడే సంబరాలు చేసుకుంటోంది. ఇక్కడ బాబూరావు మూడు సార్లు గెలిచినా అభివృద్ధి కార్యక్రమాలు లేవు అన్నది ఒక ఆరోపణ. ఇక వైసీపీలో గ్రూపులు పెరిగాయి. దాంతో పాటు వైసీపీ సర్కార్ అనుసరిస్తున్న కొన్ని విధానాల వల్ల కూడా ప్రజలు యాంటీ అవుతున్నారు. ఇవన్నీ కలసి వంగలపూడి అనితకు మంచి రోజులు వచ్చేలా చేస్తున్నాయని అంటున్నారు.

ఇక మిగిలింది అక్షరాలా రెండున్నరేళ్ళు మాత్రమే. ప్రజలలో ఇప్పటికే వ్యతిరేకత వస్తే దాన్ని మార్చుకోవడం అంటే కష్టమే. అయితే బాబూరావు మంత్రి పదవిని ఆశిస్తున్నారు. తాను మంత్రి అయితే మొత్తం రాజకీయం తనకు టర్న్ అవుతుంది అన్నది ఆయన నమ్మకం. మంత్రి హోదాలో మరో దఫా గెలవగలను అని కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి జగన్ ఆయనకు మంత్రి పదవి ఇస్తారా లేదా అన్నది కూడా చూడాలి.

ఒక వేళ ఆయన మంత్రి కాకపోతే మాజీ ఎమ్మెల్యే కూడా అవుతారని అంటున్నారు. ఇక వంగలపూడి అనితకు ఈసారి విజయం దక్కి టీడీపీ గెలిస్తే మాత్రం ఆమె మంత్రి అవడం ఖాయమని టీడీపీ తమ్ముళ్ళు అంటున్నారు. మొత్తానికి పాయకరావుపేటకు మంత్రి పదవి ఖాయమని, అది టీడీపీ నుంచా వైసీపీ నుంచా అన్నది తేలాలి అని చెబుతున్నారు. అలాగే అనిత మినిస్టర్ అవుతుందా బాబూరావు అవుతారా అన్నది కూడా చూడాలి.

Discussion about this post