కరోనా వల్ల ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలని ఆదుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు దీక్ష చేసిన విషయం తెలిసిందే. కరోనా వల్ల చనిపోయిన కుటుంబాలని సైతం ఆదుకోవాలని బాబు డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రజల కోసం దీక్ష చేసిన చంద్రబాబుపై వైసీపీ నేతలు విమర్శలు చేయడం మొదలుపెట్టారు. విచిత్రం ఏంటంటే మొన్నటివరకు టీడీపీలో పనిచేసి వైసీపీలోకి వెళ్ళిన డొక్కా మాణిక్యవరప్రసాద్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.అంటే వైసీపీ అధిష్టానం చెప్పిందని చెప్పి తప్పక విమర్శలు చేశారో లేక కావాలని మాట్లాడారో తెలియదు గానీ డొక్కా మాత్రం లాజిక్ లేకుండా మాట్లాడేశారు. అవినీతికి ఆస్కారం లేకుండా ప్రతి లబ్ధిదారుడికి ప్రయోజనం చేకూరుతుందని, దీక్ష పేరుతో ప్రభుత్వంపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారని, తన హయాంలో పేదలకు చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని డొక్కా డిమాండ్ చేశారు.
ఇక పథకాల్లో అవినీతి జరుగుతుందో లేదో ప్రజలకు తెలుసు, వైసీపీ నేతలకు బాగా తెలుసు. కాబట్టి ఆ విషయం పక్కనబెట్టేస్తే, ప్రజలకు మేలు చేయాలని బాబు దీక్ష చేస్తే, అది తప్పుడు ప్రచారం ఎలా అయిందో డొక్కానే చెప్పాలని అంటున్నారు. ఇక గత హయాంలో అంటే.. చంద్రబాబు ప్రభుత్వంలో, అలాగే డొక్కా అదే ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు. అంటే ఒకప్పుడు కాంగ్రెస్‌లో రాజకీయాలు చేసిన డొక్కా టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆ పార్టీలోకి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే.అలాగే ఎమ్మెల్సీగా, టీడీపీ నేతగా డొక్కా పార్టీ కోసం బలమైన వాయిస్ వినిపించారు. జగన్‌పై విమర్శలు చేశారు. అప్పుడు టీడీపీలోనే ఉన్న డొక్కాకు బాబు ఏం చేశారో తెలియకపోవడం కాస్త వింతే. ఇంతకంటే గొప్ప వింత ఏంటి అంటే చంద్రబాబు అధికారం కోల్పోయి, జగన్ అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
ఆ మూడు రాజధానులకు వ్యతిరేకంగా, అమరావతికి మద్ధతుగా డొక్కా, తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఇక్కడవరకు అంతా బాగానే ఉంది. ఇక్కడే గొప్ప లాజిక్ వచ్చింది. మూడు రాజధానులకు వ్యతిరేకంగా రాజీనామా చేసి, ఆ నిర్ణయం తీసుకున్న జగన్ చెంతకే డొక్కా వెళ్లారు. చక్కగా వైసీపీ కండువా కప్పుకున్నారు. మళ్ళీ ఎమ్మెల్సీ అయ్యి, ఇప్పుడు చంద్రబాబుపై విమర్శలు చేయడం చూస్తుంటే రాజకీయాల్లో ఏ మాత్రం లాజిక్‌లు ఉండవనే చెప్పొచ్చు.
Discussion about this post