అవకాశాన్ని బట్టి నాయకులు కండువాలు మార్చడం సహజమే. అధికారంలో ఏ పార్టీలో ఉంటే…ఆ పార్టీలోకి నాయకులు జంప్ కొట్టేస్తారు. మళ్ళీ ఆ పార్టీ అధికారం కోల్పోతే వేరే పార్టీలోకి వెళ్తారు. ఇలా రాజకీయాల్లో ఆయారం…గయారాంలు ఎప్పుడు ఉంటూనే ఉంటారు. అయితే ఇలాంటి వారి వల్లే టీడీపీ నష్టపోయిందని ఆ పార్టీలో కొందరు సీనియర్ నాయకులు మాట్లాడుతున్నారు. ఆది నుంచి పార్టీలో ఉన్నవారిని పట్టించుకోకుండా, మధ్యలో వచ్చినవారిని నెత్తి మీద పెట్టుకోవడం వల్ల పార్టీకి చాలా నష్టం జరిగిందని అంటున్నారు.

2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీలోకి ఎంతమంది నాయకులు వచ్చారో చెప్పాల్సిన పని లేదు. అటు కాంగ్రెస్ నుంచి, ఇటు వైసీపీ నుంచి నాయకులు ఎడాపెడా టీడీపీలో చేరారు. అలాగే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు టీడీపీలోకి వచ్చారు. అయితే ఇలా వచ్చిన నాయకులకే చంద్రబాబు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని చెప్పొచ్చు. కొంతమందికి మంత్రి పదవులు, నామినేటెడ్ పదవులు, ఎమ్మెల్సీలు ఇలా చాలా పదవులు ఇచ్చారు.

అయితే మొదట నుంచి పార్టీకి పనిచేస్తున్న నాయకులకు పెద్ద ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపించలేదు. పైగా అధికారంలో ఉండగా కార్యకర్తలని సైతం పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు అధికార వైసీపీ…ఆ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పెద్ద ఎత్తున పదవులు ఇచ్చింది. కానీ ఇలా గతంలో చంద్రబాబు..టీడీపీ వాళ్ళకు పదవులు ఇవ్వలేదు. ఏదో రెండు, మూడేళ్లు గడిచిపోయాక పదవుల పంపకాలు చేశారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

అలా పార్టీలో జంపింగ్ నాయకులకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో 2019 ఎన్నికల్లో పార్టీకి పెద్ద డ్యామేజ్ జరిగింది. ఇక అధికారంలో ఉండగా పదవులు అనుభవించినవారు…అధికారం కోల్పోయాక వైసీపీలోకి జంప్ చేశారు. ఉదాహరణకు జూపూడి ప్రభాకర్, డొక్కా మాణిక్యవరప్రసాద్, ఆదినారాయణరెడ్డి లాంటి వారు టీడీపీలో పదవులు అనుభవించి, అధికారం కోల్పోయాక వేరే పార్టీలోకి జంప్ చేశారు. కాబట్టి పార్టీలో ఇప్పటికైనా ఆయారం…గయారాంలని ప్రోత్సహించవద్దని సీనియర్లు కోరుతున్నారు.
Discussion about this post