గత ఎన్నికల్లో వైసీపీకి ఉన్న గాలిని చూసి చాలామంది సినీ నటులు జగన్ వైపుకు వెళ్ళిన విషయం తెలిసిందే. పైగా రాజకీయాలకు చాలా యేళ్లుగా దూరంగా ఉంటోన్న మోహన్ బాబు లాంటి వాళ్లు సైతం వైసీపీ కండువా కప్పుకుని మరీ జగన్‌ను గెలిపించి.. బాబును చిత్తుగా ఓడించాలని చెప్పారు. అబ్బో జీవిత, హేమ, శ్యామల, ఆనంద్ , పృథ్వి, పోసాని ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది సినిమా వాళ్లు జగన్‌కు మద్దతు తెలిపారు. ఈ క్రమంలోనే కొన్నేళ్లుగా ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ టీడీపీకి మద్ధతుగా ఉన్న ఆలీ సైతం వైసీపీ వైపుకు వెళ్లారు. అయితే 2019 ఎన్నికల ముందు ఈయనకు టీడీపీలో సీటు వస్తుందని ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా ఆలీ వైసీపీలో చేరారు. కానీ అక్కడ ఆయనకు ఎలాంటి సీటు రాలేదు గానీ, ఎన్నికల్లో ఆ పార్టీ తరుపున మాత్రం ప్రచారం చేశారు.
ఆలీ చేసిన ప్రచారానికి విజయసాయి రెడ్డి లాంటి వాళ్లు సైతం ఆయన్ను ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. అయితే పార్టీ అధికారంలోకి వచ్చాక ఆలీకి ఏదొక నామినేటెడ్ పదవి గానీ, ఎమ్మెల్సీ పదవి గానీ రావొచ్చు అని ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే ఆలీకి వక్ఫ్ బోర్డు ఛైర్మన్ లేదా మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి రావొచ్చు అని కథనాలు వచ్చాయి. అయితే ఈ రెండు పదవులు ఆలీకి రాలేదు. ఇటీవల వేరే నాయకులకు ఈ పదవులు కట్టబెట్టారు. అలా అని ఎమ్మెల్సీ పదవి కూడా ఏమి దక్కలేదు.
కానీ ఆలీకి ఇప్పటివరకు ఎలాంటి పదవి దక్కలేదు. కాకపోతే ఏదొక పదవి వస్తుందనే ఉద్దేశంతో ఆలీ ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఇటీవల మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల సమయంలో కూడా వైసీపీ తరుపున కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ప్రచారం చేశారు. ఇక ఎన్నికల్లో వైసీపీ అయితే గెలుస్తుంది గానీ, ఆలీకి మాత్రం ఎలాంటి పదవి రావడం లేదు. నామినేటెడ్ పోస్టులు కూడా భర్తీ కావడంతో ఆలీకి జగన్ హ్యాండ్ ఇచ్చేసినట్లే కనిపిస్తోంది.
Discussion about this post