ఇప్పుడు ఏపీ ప్రభుత్వం మొత్తం సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చుట్టూనే తిరుగుతున్నట్లు కనిపిస్తోంది. సాధారణంగా సీఎం జగన్ ఎక్కువగా బయటకు రారు. ఆయన సచివాలయం లేదా తాడేపల్లిలోనే ఇంటికే పరిమితమవుతున్నారనే విమర్శలు ఉన్నాయి. అలాగే మీడియా సమావేశాలు పెట్టడం కూడా అరుదు. ఒకవేళ ఏమైనా పెడితే అవి రికార్డ్ చేసిన సమావేశాలే. అందులోనూ జగన్ తెలుగు గురించి చెప్పాల్సిన పని లేదని తెలుగు తమ్ముళ్ళు అంటున్నారు.
సరే జగన్ తర్వాత రాష్ట్రానికి చూసుకోవాల్సింది మంత్రులు. కానీ ఇక్కడ పూర్తిగా విరుద్ధంగా…ఏ వ్యవహారమైన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చూసుకుంటున్నారు. ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తే ఈయనే కౌంటర్లు ఇస్తారు. ఏమైనా సమావేశాలు, శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు…ఏమైనా సరే సజ్జలనే కనిపిస్తున్నారని తెలుగు తమ్ముళ్ళు చెబుతున్నారు.
బీసీలకు సంబంధించిన సమావేశాలు పెడితే ఈయనే మెయిన్‌గా ఉంటారు. పోలీసుల సమావేశాల్లో ఈయన కనిపిస్తారు. తాజాగా ఏలూరు కార్పొరేషన్ ఫలితంపై ఈయనే స్పందించారు. అటు నీటి వివాదంపై ఈయనే మాట్లాడుతారు. టీడీపీకి కౌంటర్లు ఈయనే ఇస్తారు. గ్రామ సచివాలయ ఉద్యోగుల పరీక్షలు గురించి ఈయనే మాట్లాడుతారు. అబ్బో ఒక్క పని ఏంటి ఆల్‌రౌండర్‌గా ఏపీ ప్రభుత్వంలోని అన్నీ పనులు సజ్జలనే చేస్తున్నారని చెప్పి రాజకీయ ప్రముఖులు ఆశ్చర్యపోతున్నారు.
మరి సజ్జల ఒక్కరే ప్రభుత్వ భారాన్ని తన భుజాల మీద వేసుకుని నడిపిస్తుంటే మంత్రులు ఏం చేస్తున్నారో తెలియడం లేదని అంటున్నారు. అంటే సజ్జల ఆల్‌రౌండర్‌గా పనిచేస్తుంటే, మంత్రులు ఆయన చుట్టూ రౌండ్లు వేస్తున్నట్లు ఉన్నారని మాట్లాడుకుంటున్నారు. ఇక సీఎం తర్వాత అంతా సజ్జల అనే విధంగా వైసీపీ ప్రభుత్వం వ్యవహారం నడుస్తుందని తెలుస్తోంది.
Discussion about this post