ఆ కులపోళ్లంతా 5 ఎకరాలకు అమ్ముడు పోతారా ?
తెలంగాణలో రాజకీయం రంగులు మారుతోంది. టీ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని నియమించడంతో నిన్నటి వరకు చావచచ్చి ఉన్న కాంగ్రెస్‌కు ఇప్పుడు ఒక్కసారిగా జవసత్వాలు వచ్చిన మాట నిజం. ఈ క్రమంలోనే నిన్నటి వరకు ఫామ్ హౌస్ దాటి బయటకు రారని ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోన్న సీఎం కేసీఆర్ ఇప్పుడు ఏకంగా గ్రామాల బాట పట్టారు. ఆ మాటకు వస్తే సీఎం కేసీఆర్ దర్శనం సామాన్యులకు కాదు కదా…
గత ఆరేడేళ్లుగా ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులకే దర్శనం లేదన్న టాక్ కూడా ఉంది. అలాంటిది గత నెల రోజులుగా చూస్తే కేసీఆర్ మాత్రమే కాదు.. ఆయన కుటుంబం కూడా పడుతోన్న గాబరా చూస్తుంటే రేవంత్ పేరుకే వాళ్లు అలెర్ట్ అవుతున్నారా ? అన్న సందేహాలు, చర్చలు కూడా వినిపిస్తున్నాయి.
ఇక కేసీఆర్ ప్రతి ఎన్నికకు కుల రాజకీయాలను వాడుకుని తిరుగులేని ఘనవిజయాలు సాధిస్తూ వస్తున్నారు. అయితే తెలంగాణలో కొద్ది రోజులుగా జరుగుతోన్న పరిణామాల నేపథ్యంలో కమ్మలు, రెడ్లు టీఆర్ ఎస్‌కు దూరమవుతోన్న పరిస్థితి ఉందంటున్నారు. దళిత సామాజిక వర్గంలో కూడా మార్పు వస్తోందని.. వారు ఎక్కువుగా బీజేపీ వైపు మళ్లుతున్నారన్న చర్చలు ఉన్నాయి. అయితే కేసీఆర్ ఓ వైపు దళితులను ఆకర్షించే ప్రక్రియకు కొద్ది రోజుల క్రితమే శ్రీకారం చుట్టేశారు. ఎందుకంటే దళితులు ముందు నుంచి కాంగ్రెస్‌కు ఓటు బ్యాంకు.. రేవంత్ రాకతో వాళ్లు ఎక్కడ కాంగ్రెస్ వైపు మళ్లుతారో ? అన్న సందేహం కేసీఆర్‌కు ఉండడంతోనే ఆయన ఈ ప్లాన్ వేశారు.
ఇక రెడ్లలో ఎక్కువ మంది గత కొంత కాలంగా కేసీఆర్‌కు అనుకూలంగా ఉండక తప్పని పరిస్థితి. అయితే ఇప్పుడు వారిలో కూడా మార్పు వస్తోంది. ఇక కమ్మలు కూడా గత్యంతరం లేని పరిస్థితుల్లో కేసీఆర్, టీఆర్ ఎస్ వైపే ఉంటున్నారు. అయితే ఎక్కువ మంది సెటిలర్స్ కమ్మలు, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న కమ్మలకు రేవంత్ అంటే కూడా ఎనలేని అభిమానం. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. రేవంత్ ఒకప్పుడు కమ్మలు అభిమానించే టీడీపీ వాడే. ఇక తెలంగాణలో నలభై అయిదు అసెంబ్లీ నియోజకవర్గాలలో కమ్మవాళ్ళు ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభావితం చూపించగల ప్రభావితంచేయగల గణనీయమైన ఓటుబ్యాంకు ఉండడం ఒక ముఖ్య కారణం.
పైగా వాళ్లు సినిమా, మీడియా రంగాల్లో ప్రముఖులుగా ఉన్నారు. ఈ క్రమంలోనే కేసీఆర్ కమ్మలను దువ్వేందుకే హైదరాబాద్‌లో ఖరీదైన ప్రాంతంలో ఆ కులపు సంఘాలకు ఐదు ఎకరాల స్థలం ఇచ్చారని అంటున్నారు. అయితే ఈ ఐదు ఎకరాలతో తెలంగాణలో ఉన్న కమ్మలు అందరూ టీఆర్ ఎస్‌కు మొగ్గు చూపే ఛాన్స్ అయితే ఉండదని.. ఈ సారి వాళ్లంతా అదను చూసి షాక్ ఇస్తారనే అంటున్నారు.
Discussion about this post