అపుడే టీడీపీ వారిలో ఆశలు పెరిగిపోతున్నాయి. అవి అలా ఇలా లేవు. తమ ప్రభుత్వం వచ్చేసినట్లే అని ఒక్కసారిగా రెక్కలు కట్టుకుని కలలలో తేలిపోతున్నారు. ఇంకా రెండున్నరేళ్ళ కాలం గడవాలి. కానీ ఎందుకో తమ్ముళ్లకు చెల్లెమ్మలకు ఎక్కడలేని ధీమా వచ్చేస్తోందిట. అలాంటి వారు విశాఖ జిల్లా నిండా కనిపిస్తున్నారు. వారిలో టీడీపీలో బాగా ప్రాముఖ్యత కలిగిన నేత వంగలపూడి అనిత కూడా ఉన్నారు. ఆమెను చంద్రబాబు తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలిగా చేశారు. అంతే కాదు పొలిట్ బ్యూరో మెంబర్ ని చేశారు. దాంతో ఆమె వచ్చేసారి తాను తప్పక గెలుస్తాను అని నమ్ముతున్నారు. ఈ మధ్య వచ్చిన ఒక సర్వే కూడా ఆమె హుషార్ కి కారణం.

ఆ సర్వే ప్రకారం పాయకరావుపేటలో వైసీపీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు ఓడిపోతున్నారట. ఆయన ఇప్పటికి మూడు సార్లు గెలిచారు. కానీ ఈసారి ఆయనకు ఎదురుగాలి వీస్తోందని ఆ సర్వే తేల్చింది. దాంతో వైసీపీలో నిరుత్సాహం నిండా కమ్ముకుంటే అనిత వర్గం మాత్రం హోళీ పండుగనే జరుపుకుంటోంది. అనిత 2014 నుంచి 2019 వరకూ అయిదేళ్ళ పాటు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆమె పట్ల అక్కడ జనాలకు కూడా సానుభూతి ఉంది. ఆమె ఉపాధ్యాయురాలిగా ఉండడంతో పాటు మంచి మాటకారి కావడంతో ప్రజలతో మంచి సంబంధాలనే నెరుపుతున్నారు. ఇక ఆమె గతంలో చేసిన తప్పులను కూడా సరిదిద్దుకుని ముందుకు సాగుతున్నారు.

ఇక్కడ పెద్ద సంఖ్యలో ఉన్న కాపులు కూడా ఈసారి టీడీపీ వైపు టర్న్ అవుతారు అని కూడా అనిత భావిస్తున్నారుట. దాంతో పాటు పార్టీలో కూడా వర్గ పోరుని ఆమె జాగ్రత్తగా పరిష్కరించుకుంటున్నారు. మొత్తానికి అనిత తాను ఖచ్చితంగా గెలవడం ఖాయమని నమ్ముతున్నారు. అదే విధంగా ఏపీలో టీడీపీ సర్కార్ రావడమూ ఖాయమనే ఆమె భావిస్తున్నారు. దాంట్లో తనకు ఈసారి తప్పకుండా మంత్రి పదవి దక్కుతుందని కూడా ఆశలు పెట్టుకున్నారు. గతసారే నిజానికి ఆమెకు మంత్రి ఛాన్స్ రావాలి. కానీ అది చివరలో తప్పిపోయింది.

ఈసారి మాత్రం తనను తప్పకుండా చంద్రబాబు కరుణిస్తారు అని అనిత లెక్కలు వేసుకుంటున్నారు. దానికి సామాజికవర్గం, మహిళా కోటా, లీడర్ షిప్ క్వాలిటీస్, జిల్లాలో ఉన్న సమీకరణలు అన్నీ కూడా తనకు కలసి వస్తాయని అనిత నమ్ముతున్నారు. మరి చూడాలి ఆమె ఆశలు నేరవేరాలి అంటే చాలా జరగాలి.
Discussion about this post