టీజీ వెంకటేష్….ఏపీ రాజకీయాల్లో సీనియర్ నాయకుడు…తెలుగుదేశంలో రాజకీయ జీవితం మొదలు పెట్టి, ఆ తర్వాత కాంగ్రెస్‌లో కీలక నేతగా పనిచేసిన టీజీ రాష్ట్ర విభజన తర్వాత మళ్ళీ టీడీపీలో చేరి 2014 ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ నుంచి పోటీ చేసి స్వల్ప మెజారిటీ తేడాతో ఓడిపోయారు. ఇక మధ్యలో చంద్రబాబు, ఆయనకు రాజ్యసభ కూడా ఇచ్చారు. 2019 ఎన్నికలోచ్చేసరికి టీజీ వారసుడు భరత్, కర్నూలులో పోటీ చేసి తక్కువ మెజారిటీతో ఓడిపోయారు.
అయితే తర్వాత టీజీ వెంకటేష్ బీజేపీలోకి వెళ్ళినా సరే భరత్ మాత్రం టీడీపీలోనే ఉంటూ పోరాటం చేస్తున్నారు. నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేస్తూ, వైసీపీకి ధీటుగా పనిచేస్తున్నారు. ఇదే సమయంలో వైసీపీలో ఉండే లుకలుకలు భరత్‌కు బాగా కలిసొచ్చేలా ఉన్నాయి. కర్నూలు వైసీపీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్‌కు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డిలకు అసలు పడటం లేదు. 2014లో ఎస్వీ వైసీపీ తరుపున గెలిచి, టీడీపీలోకి వచ్చారు.
2019 ఎన్నికల ముందు మళ్ళీ వైసీపీలోకి వెళ్ళిపోయారు. కానీ జగన్ టికెట్ ఎస్వీకు ఇవ్వకుండా హఫీజ్‌కు ఇచ్చారు. జగన్ వేవ్‌లో హఫీజ్ ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఎస్వీ కూడా నియోజకవర్గంలో తనదైన శైలిలో పనిచేసుకుంటూ ముందుకెళుతున్నారు. నెక్స్ట్ ఎన్నికల్లో మళ్ళీ కర్నూలు టికెట్ దక్కించుకోవాలని చూస్తున్నారు. అటు హఫీజ్ తన సీటుని నిలుపుకోవాలని అనుకుంటున్నారు. ఇలా వీరి మధ్య ఆధిపత్య పోరు తీవ్రంగా జరుగుతుంది. దీంతో వైసీపీ క్యాడర్ కూడా రెండుగా చీలిపోయింది.
ఒకరికి టికెట్ ఇస్తే, మరొకరికి సహకరించే పరిస్తితి కనిపించడం లేదు. దీంతో భరత్‌కు బెనిఫిట్ అయ్యేలా ఉంది. పైగా గత రెండు పర్యాయాలుగా టీడీపీ తరుపున స్వల్ప మెజారిటీ తేడాతో ఓడిపోతూ వస్తుంది. ఆ సానుభూతి కూడా భరత్‌కు వర్కౌట్ అయ్యేలా కనిపిస్తోంది. మొత్తానికి ఈసారి కర్నూలులో టీజీ వారసుడు పసుపు జెండా ఎగరేసేలా కనిపిస్తున్నారు.
Discussion about this post