ఆ నేత సుధీర్ఘకాలంగా రాజకీయాలు చేస్తున్నారు. టీడీపీలో ఎక్కువ కాలం రాజకీయాలు చేసిన ఆయన రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు మంత్రిగా కూడా పనిచేశారు. తర్వాత అదే టీడీపీ నుంచి వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోతూ వస్తున్నారు. టీడీపీలో ఉండగా తన చిరకాల రాజకీయ శత్రువును చంద్రబాబు టీడీపీలోకి తీసుకోవడంతో పాటు మంత్రిని చేయడంతో ఆయన ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అయ్యారు. గత ఎన్నికల్లో ఓడిపోయాక ఇక్కడ లాభం లేదని వైసీపీలోకి జంప్ చేసేశారు. ఇక్కడ కూడా ఇప్పుడు ఆయనకు అదే ఉక్కపోత తప్పడం లేదు. ఆయనే మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి.

కడప జిల్లా జమ్మలమడుగు రాజకీయాల్లో దశాబ్దాలుగా తనదైన ముద్రవేశారు మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి. 2014 ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ఆయనపై గెలిచిన బద్ధ శత్రువు ఆదినారాయణరెడ్డిని చంద్రబాబు పార్టీలోకి తీసుకుని మంత్రిని చేశారు. గత ఎన్నికల ముందు వరకు వీరు ఎత్తులు… పై ఎత్తులతోనే కొట్టుకున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయాక రామసుబ్బారెడ్డి వైసీపీ కండువా కప్పుకున్నారు.

అయితే ఇక్కడ కూడా ఆయనకు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డితో ఢీ అంటే ఢీ అనే పరిస్థితి వచ్చేసింది. పలు పంచాయితీల తర్వాత చివరకు జగన్ వచ్చే ఎన్నికల్లోనూ సుధీర్‌రెడ్డికి జమ్మలమడుగు సీటు అని.. రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ అని చెప్పేశారు. అయితే ఇప్పుడు సుధీర్‌రెడ్డి రామసుబ్బారెడ్డి వర్గాన్ని పూర్తిగా అణిచివేయడంతో పాటు చిన్నా చితకా పనులు కూడా కానివ్వడం లేదట. పార్టీ మారినా ఫలితం దక్కలేదని రామసుబ్బారెడ్డి వర్గం రగిలిపోతోంది.

నాడు టీడీపీలోనూ సొంత పార్టీ శత్రువులతోనే పోరాటం.. ఇప్పుడు వైసీపీలోనూ పనుల కోసం సొంత పార్టీ ఎమ్మెల్యేతో పోరాటం రామసుబ్బారెడ్డికి కూడా చికాకుగా మారిందట. ఒకానొక దశలో రామసుబ్బారెడ్డి పార్టీ మారిపోతారన్న ప్రచారం కూడా జోరుగా జరిగింది. ఇటీవల సజ్జల పిలిపించినా ఆయన వెళ్లకపోవడంతో ఆయన పార్టీ మార్పు వార్తలకు మరింత బలం చేకూరినట్లయ్యింది. ఇప్పుడు సరైన నిర్ణయం తీసుకోకపోతే మీతో పాటు మాకు కూడా భవిష్యత్ ఉండదని .. ఆయన వర్గం ఆయనపై ఒత్తిడి చేస్తోంది. ఏదేమైనా రామసుబ్బారెడ్డి ఎప్పుడైనా బరస్ట్ అయ్యి సంచలన నిర్ణయం తీసుకోవచ్చనే అంటున్నారు.

Discussion about this post