ఏపీలో తాజాగా వెలువడిన ఎంపిటిసి, జెడ్‌పిటిసి ఎన్నికల్లో అధికార వైసీపీ సత్తా చాటిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా వన్‌సైడ్ విజయాలు సాధించింది. టిడిపి ఎన్నికలని బహిష్కరించినా సరే కొన్నిచోట్ల బరిలో నిలబడి వైసీపీకి పోటీ ఇచ్చింది. అటు జనసేన కూడా కొన్నిచోట్ల ప్రభావం చూపింది. ఇక కొన్ని చోట్ల స్థానిక నేతలు పరస్పరం ఓ అవగాహనకు వచ్చి జనసేనతో కలిసి పోటీ చేశారు. కొద్ది రోజుల క్రితం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ గోదావరి , ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈ రెండు పార్టీలు పోటీ చేసిన చోట వైసీపీకి షాక్ తగిలింది. తాజాగా ఈ రెండు పార్టీలు కలిసి ఒక మంత్రికి ఎసరు పెట్టాయి.

అసలు స్థానిక సమరంలో 90 శాతంపైనే స్థానాలు గెలవకుండా ఉంటే పదవులు పోతాయని జగన్ ఎప్పుడో హెచ్చరించిన విషయం తెలిసిందే. అందుకే ఎవరికి వారు శక్తివంచన లేకుండా కుట్రలు చేయని, అరాచకాలు చేయని ఏదొకవిధంగా గెలవాలనే విధంగా వైసీపీ నేతలు ప్రయత్నించారు. ఇక ఈ ప్రయత్నాల్లో వైసీపీ నేతలు సూపర్ సక్సెస్ అయ్యారు. కానీ కొంతమంది మాత్రం చిక్కుల్లో పడ్డారు. కొన్ని చోట్ల టిడిపి…వైసీపీకి చుక్కలు చూపించింది. ఇక టిడిపి-జనసేనలు కలిసి మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథరాజుకు చుక్కలు చూపించాయి. రంగనాథరాజు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆచంటలో వైసీపీకి షాక్ తగిలింది.

ఆచంట మండలంలో టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకుని 17 ఎంపీటీసీ స్థానాలకు పోటీ చేయగా, అందులో టీడీపీ 7, జనసేన 4 స్థానాలను గెలుచుకోగా, వైసీపీ 6 స్థానాలని గెలుచుకుంది. అంటే ఆచంట ఎంపీపీ టిడిపి-జనసేనల వశం కానుంది. అటు ఆచంట జెడ్పీ స్థానం కూడా టిడిపితో పొత్తులో భాగంగా జనసేన గెలుచుకుంది. అంటే మంత్రి గారికి టిడిపి-జనసేనలు గట్టిగానే షాక్ ఇచ్చాయి. అసలే నెక్స్ట్ మంత్రివర్గ విస్తరణలో రంగనాథరాజు పదవి పోవడం ఖాయమని ప్రచారం జరుగుతుంది. ఇలాంటి సమయంలో స్థానిక సమరంలో టిడిపి-జనసేనలు మంత్రి గారికి చెక్ పెట్టి మరీ ఇబ్బందుల్లోకి నెట్టారు. మరి రంగనాథరాజు బెర్త్ ఏం అవుతుందో చూడాలి.

Discussion about this post