ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఈ నెల కూడా అందలేదు. ఫస్ట్ తారీఖున జీతాలు అన్న మాటను ఉద్యోగులు మరచిపోవాల్సిందే అని జగన్ చెప్పకనే చెప్పేస్తున్నారు. గత నాలుగైదు నెలలుగా ఇదే పరిస్థితి సాగుతోంది. పోనీ ఒక నెల అంటే సర్దుకోవచ్చు. కానీ ప్రతీ నెలా ఒకటవ తేదీ నుంచి కళ్ళు కాయలు కాచేలా వేచి చూడడం ఏంటి అని ఉద్యోగులు మండిపోతున్నారు. దాంతో వారు కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడేలా వైసీపీ ఏలుబడిలో తమ కధ ఉందని కూడా మదనపడుతున్నారు. ఏపీలో ఎన్నో పెండింగ్ సమస్యలు ఉద్యోగులకు ఉన్నాయి. జీతాలకే ఠికానా లేని చోట అవి నెరవేరుతాయన్న ఆశ అసలు లేదు అంటున్నారు.

ప్రతీనెలా ఉద్యోగుల జీతలకు, పెన్షన్లకు కలుపుకుని ఏకంగా అయిదున్నర వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. అయితే ప్రభుత్వానికి ప్రతీ నెలా కేంద్రం వద్ద నుంచి పన్నుల రూపంలో వచ్చే ఆదాయం కచ్చితంగా రెండు వేల కోట్ల రూపాయల దాకా వస్తుంది. దాంతో ఆ మొత్తాన్ని సామాజిక పించన్లకు సర్కార్ మళ్ళిస్తోంది. 1450 కోట్ల రూపాయలు చెల్లిస్తే చాలు సామాజిక పెన్షన్లు టోటల్ గా ఇవ్వడం జరిగిపోతుంది. అదే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలంటే ఎవరికీ సరిపోవు. దాంతో జగన్ తన హామీలు నెరవేర్చుకోవడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు.ఇక ప్రతీ మంగళవారం బాండ్లను రిజర్వ్ బ్యాంక్ వద్ద వేలం వేయడం ద్వారా వచ్చే రెండేసి వేల రూపాయలతో విడతల వారీగా ఉద్యోగులకు పెన్షన్లకు డబ్బులు వారి ఖాతాలో వేస్తున్నారు. ఆ విధంగా చేయడం వల్ల మూడు నాలుగు వారాల దాకా కూడా జీతలు ఖాతాలో పడడం లేదు. ఈ పరిణామంతో ఉద్యోగులు గగ్గోలు పెడుతున్నారు. ఎవరికి జీతాలు పడ్డాయి ఎవరికి పడలేదు అన్నది కూడా లాటరీగా మారిపోయింది అని వారు వాపోతున్నారు. జగన్ ప్రభుత్వంతో ఇంత దయనీయ స్థితి ఉంటుందని తాము ఊహించలేదని వారు వాపోతున్నారు. జగన్‌ను గెలిపించినందుకు ఇప్పుడు అనుభవిస్తున్నామని వారు గగ్గోలు పెడుతున్నారు.

జీతాలకే ఇలా మూలుగుతూంటే ఇక ఈ సర్కార్ 11వ పీయార్సీని ఎలా ఈ సర్కార్ అమలు చేస్తుంది అని వారే అనుకుంటున్నారు. మొత్తానికి ఏపీలో ఉద్యోగుల పరిస్థితి మాత్రం దయనీయంగా మారిపోతోంది. జగన్ సర్కార్ మాత్రం ఏదో ఇవ్వాలి కాబట్టి జీతాలు ఇస్తున్నాం కదా అన్నట్లుగా ఉంది. మొత్తానికి ప్రతీ నెలకూ ఇలా డబ్బుల కోసం వెతుక్కోవడం అంటే మాత్రం ఇబ్బందే. పైగా సర్కార్ పరువు కూడా పోతుంది.
Discussion about this post