ఏపీలో అధికార వైసీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు అడకత్తెరలో పడ్డారు. వాళ్ళు ఎటూ తేల్చుకోలేక సతమతమవుతున్నారు. ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు ఎవరో ? ఆ కథ ఏంటో చూద్దాం. విశాఖ జిల్లాలో ఏజెన్సీ ప్రాంతంలో షెడ్యూల్ – షెడ్యూల్ అంశం మళ్లీ తెరమీదకు వచ్చింది. ఈ క్రమంలోనే ఈ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న మాడుగుల – చోడవరం – నర్సీపట్నం ప్రాంతాల్లో ఈ వివాదం హీటెక్కిస్తోంది. ఈ మూడు నియోజకవర్గాల్లోని తొమ్మిది మండల పరిధిలో ఉన్న 163 రెవిన్యూ గ్రామాలలో 80 వేల మందికి పైగా ప్రజలు నివసిస్తున్నారు. వీరిలో గిరిజనేతరుల కంటే గిరిజన జనాభా ఎక్కువగా ఉంది. 2004 లో తొలిసారిగా సబ్ ప్లాన్ ఏరియా లోని ఆదివాసి గ్రామాలను షెడ్యూల్డ్ ప్రాంతంగా మారుస్తామని నాడు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా ఆ హామీ నెరవేరలేదు. అప్పటి నుంచి ఈ వివాదానికి బ్రేకులు లేవు.

ప్రస్తుతం ఈ మూడు నియోజకవర్గాల్లోనూ వైసీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు. చోడవరం నుంచి కరణం ధర్మశ్రీ – మాడుగుల నుంచి బూడి ముత్యాలనాయుడు – నర్సీపట్నం నుంచి పెట్ల ఉమాశంకర్ గణేష్ వైసిపి ఎమ్మెల్యేలు ఉన్నారు. సబ్ ప్లాన్ ఏరియాలోని గ్రామాల అభివృద్ధి పై ఇప్పటివరకు పెద్దగా చర్చ జరగలేదు. ఇక్కడ తమ హక్కుల కోసం గిరిజనులు పెద్దగా ఆరాట పడలేదు. తాజాగా విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్మెంట్ ఆధారిటీ ని ప్రభుత్వం భారీగా విస్తరించింది. జిల్లాలో ఏజెన్సీ మండలాలు మినహా మిగిలిన ప్రాంతం అంతా ఈ ప్రాంతం పరిధిలోకి రావడంతో గ్రామీణప్రాంతాల్లో భూములకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి.

పైన చెప్పిన మూడు నియోజకవర్గాల్లో భూముల ధరలు రెట్టింపు అయ్యాయి. మరోవైపు సబ్ ప్లాన్ ఏరియాలో ఉన్న గిరిజన జనాభా పల్లెలు తమను షెడ్యూల్ గ్రామాలుగా గుర్తించాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఇక్కడ భూములు కొనుగోలు చేసిన వారిలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారే అధికంగా ఉన్నారు. అయితే ఇప్పుడు గిరిజనులు డిమాండ్ అక్కడ భారీ ఎత్తున ఉండడంతో… ఎమ్మెల్యేలు ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నారు. సబ్ ప్లాన్ చట్టం అమల్లోకి వస్తే అక్కడ గిరిజనేతరులు కొనుగోలు చేసిన భూములపై ఆంక్షలు అమలులోకి వస్తాయి.

అప్పుడు వారికి ఉన్న భూములకు విలువ ఉండదు… సరికదా లావాదేవీలు కూడా బ్రేక్ అవుతాయి. దీంతో గిరిజనుల వైపా ? గిరిజనేతరుల వైపా ? అన్నది తేల్చుకోలేక ఈ ఎమ్మెల్యేలు సతమతమవుతున్నట్లు స్థానికంగా చర్చ వినిపిస్తోంది.
Discussion about this post