విపక్షాలు చెబుతూంటే ప్రభుత్వం బుర్రకు ఎక్కలేదు. కానీ తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అసలు నిజం చెప్పేసరికి మాత్రం పచ్చి వెలక్కాయ నోట్లో పడింది. దాంతో కక్కలేక మింగలేక అన్నట్లుగా పరిస్థితి తయారైంది. నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి జగన్ కడుతున్న ఇళ్ళ మీద హాట్ కామెంట్ చేశారు. దేనికీ సరిపోని వీటిని ఇళ్ళు అంటారా అంటూ ప్రసన్న కుమార్ రెడ్డి ఆగ్రహించారు. తమ ప్రభుత్వం మీదనే ఆయన చేసిన విమర్శలు అటూ ఇటూ కాకుండా నేరుగా వచ్చి ముఖ్యమంత్రి జగన్ కే తగిలాయట.
ఎందుకంటే జగన్న ఇళ్ళను డిజైన్ చేయించిందే జగన్. ఆయన దగ్గర ఉండి పేదవాడి బెడ్ రూమ్ ఎంత ఉండాలో తానే కొలతలు కొలిచారు. లెక్కలు తీశారు. అలా ఒక మోడల్ ని ఎంపిక చేసి మరీ ఇళ్ళు అలాగె కట్టాలంటూ హుకుం జారీ చేశారు. అంటే ప్రసన్న ఇపుడు ఆరోపిస్తున్నట్లుగా బెడ్ రూమ్ చాలా చిన్నది ఏ మాత్రం సరిపోదు అంటే ఆ నేరం పాపం ఎవరిదో కాదు ముఖ్యమంత్రిదే అన్న మాట. మరి ఆ విషయం తెలుసో తెలియదో కానీ ప్రసన్న నోటికి వచ్చిన దాన్ని మీడియా ముఖంగా చెప్పేశారు. దాంతో ముఖ్యమంత్రి ఈ సీనియర్ ఎమ్మెల్యే వ్యాఖ్యల పట్ల మండిపోతున్నారుట. ఇదేంటి ఇలా ప్రభుత్వం మీద విమర్శలు చేస్తారా అంటూ ఫైర్ అవుతున్నారుట.ఇదిలా ఉంటే గృహ నిర్మాణ మంత్రి రంగనాధరాజు అయితే ముఖ్యమంత్రికి కలిగిన కోపాన్ని అర్ధం చేసుకుని సొంత పార్టీ ఎమ్మెల్యే మీదనే విమర్శలు సంధించారు. బాధ్యత కలిగిన శాసనసభ్యుడు ఇలాగేనా మాట్లాడేది అంటూ ఆయన కూడా మీడియా ముఖంగానే గట్టిగా తగులుకున్నారు. 340 చదరపు అడుగులతో ఇంటిని నిర్మిస్తున్నామని, దేశంలో ఇంతకంటే ఎక్కువ వైశాల్యంలో పేదల ఇళ్ళు నిర్మిస్తున్నారా అంటూ ఆయన లా పాయింట్ తీస్తున్నారు. మరో వైపు లబ్దిదారులకు కూడా ఆప్షన్ ఇచ్చామని, వారు కనుక విశాలంగా కావాలనుకుంటే మరో వంద అడుగుల దాకా నిర్మించుకోవచ్చు అని ఆయన అంటున్నారు.
అయినా ఇది ముఖ్యమంత్రి జగన్ గీసిన ప్లాన్, ఆయన మనసులో పుట్టిన ఆలోచన, అంతా ఆయన వేసిన డిజైనే అంటూ అసలు విషయం చెప్పేశారు. అంటే జగనే ఈ పిచ్చిక గూళ్ళు నిర్మించాలని ప్రతిపాదించారు అని మంత్రి చెప్పడంతో జగన్ మరింత ఇరకాటంలో పడిపోయినట్లే అంటున్నారు. మొత్తానికి జగనన్న ఇళ్ళతో పేరు వస్తుందని, శాశ్వతంగా తాము అధికారంలో ఉండవచ్చు అని కలలు కంటున్న వైసీపీ అధినాయకత్వానికి సొంత పార్టీ ఎమ్మెల్యే చేసిన కామెంట్స్, దాని మీద మంత్రి రియాక్షన్ ఇవ్వన్నీ కొత్త తలనొప్పిని తెస్తున్నాయని అంటున్నారు.
Discussion about this post