కడప జిల్లా అంటేనే వైఎస్సార్ ఫ్యామిలీకి కంచుకోట అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదట నుంచి జిల్లాలో కాంగ్రెస్ చాలా స్ట్రాంగ్‌గా ఉండేది. ఇక్కడ టిడిపికి పెద్దగా విజయాలు వచ్చేవి కాదు. అలాగే వైసీపీ వచ్చాక కూడా జిల్లాలో టిడిపికి అసలు కలిసిరావడం లేదు. అలా టిడిపికి కలిసిరాని నియోజకవర్గాల్లో మైదుకూరు కూడా ఒకటి. అసలు టిడిపి ఆవిర్భవించాక…ఇక్కడ గెలిసింది రెండుసార్లు మాత్రమే.1985, 1999 ఎన్నికల్లో మాత్రమే మైదుకూరులో టిడిపి జెండా ఎగిరింది. మిగిలిన సార్లు కాంగ్రెస్ గెలిచింది. అది కూడా కాంగ్రెస్ తరుపున డిఎల్ రవీంద్ర రెడ్డి విజయం సాధించారు. అయితే ఆ రెండు ఎన్నికల్లో టిడిపి తరుపున శెట్టిపల్లి రఘురామిరెడ్డి గెలిచారు. ఇక ఇదే నాయకుడు గత రెండు పర్యాయలుగా వైసీపీ తరుపున విజయం సాధిస్తున్నారు.

శెట్టిపల్లి వైసీపీకి వెళ్ళడంతో గత రెండు పర్యాయాలుగా పుట్టా సుధాకర్ యాదవ్ టిడిపి తరుపున పోటీ చేసి ఓడిపోతూ వస్తున్నారు. రెండు పర్యాయాలు ఓడిపోయినా సరే పుట్టా, మైదుకూరు ప్రజలకు అండగా నిలబడుతూనే ఉన్నారు. గతంలో టిడిపి అధికారంలో ఉండటంతో నియోజకవర్గంలో మంచిగా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు కూడా ప్రజా సమస్యలపై గట్టిగానే పోరాటం చేస్తున్నారు. పైగా స్థానిక ఎమ్మెల్యే శెట్టిపల్లిపై నిదానంగా వ్యతిరేకత పెరుగుతున్నట్లు తెలుస్తోంది.ఆ వ్యతిరేకత మొన్న జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో స్పష్టంగా కనబడింది. రాష్ట్రమంతా వైసీపీ హవా నడిచిన మైదుకూరు మున్సిపాలిటీలో టిడిపి పైచేయి సాధించింది. మున్సిపాలిటీలో 24 వార్డుల్లో టిడిపి 12 వార్డులు గెలుచుకోగా, వైసీపీ 11, జనసేన 1 వార్డు గెలుచుకున్నాయి. అయితే వైసీపీ అధికారంలో ఉండటంతో మున్సిపాలిటీ ఆ పార్టీకే దక్కింది. కానీ ఇక్కడ నైతిక విజయం టిడిపిదే అని చెప్పొచ్చు.

ఇలా మున్సిపాలిటీలో పైచేయి సాధించిన టిడిపి…వచ్చే ఎన్నికల్లో మైదుకూరు నియోజకవర్గంలో పైచేయి సాధించే అవకాశం ఉందని తెలుస్తోంది. వైసీపీ ఎమ్మెల్యే మీద వ్యతిరేకత…పుట్టా రెండుసార్లు ఓడిపోయారనే సానుభూతితో…ఈసారి వైసీపీ కంచుకోటగా ఉన్న మైదుకూరు టిడిపి వశమయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

Discussion about this post