తెలుగుదేశం పార్టీలో ఉండగా మాజీ మంత్రి శిద్ధా రాఘవరావుది రాజ వైభోగమే…! ఆయన ఒంగోలు ఎమ్మెల్యేగా పోటీ చేసి మంత్రి బాలినేని శ్రీనివాస్ చేతిలో అప్పట్లో ఓడిపోయారు. ఆ తర్వాత చంద్రబాబు ఆయనను గౌరవించి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. శిద్ధాకు ఎన్నో సార్లు అండగా ఉన్నారు. ఈ క్రమంలోనే 2014 ఎన్నికలకు ముందు దర్శి నియోజకవర్గ అసెంబ్లీ పగ్గాలు ఇచ్చారు. అప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆయన పార్టీ పగ్గాలు స్వీకరించేందుకు ఒప్పుకోలేదు. అయితే పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి ఇస్తానని చెప్పడంతో శిద్ధా దర్శి పగ్గాలు చేపట్టారు.

2014 ఎన్నికల్లో ఆయన స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు. ఈ క్రమంలోనే వైశ్య సామాజిక వర్గం కోటాలో చంద్రబాబు ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు. మధ్యలో ఆయన పనితీరు సరిగా లేకపోయినా కూడా చంద్రబాబు శిద్ధాను ఐదేళ్ల పాటు తన కేబినెట్లో కొనసాగించారు. ఇక గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన దర్శిలో పోటీ చేస్తే విజయం సాధించే పరిస్థితులు లేవు. అయితే బాబు ఆయన్ను ఒంగోలు ఎంపీగా పోటీ చేయించారు. అయితే ప్రస్తుత ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి చేతిలో ఘోరంగా ఓడిపోయారు.

అయితే ఎన్నికల్లో ఓడిపోయిన కొద్ది రోజులకే శిద్ధా వైసీపీ కండువా కప్పుకున్నారు. టీడీపీలో ఉండగా రాజభోగం వెలగబెట్టిన శిద్దా, ఆయన కుమారుడిని ఇప్పుడు వైసీపీలో పట్టించుకున్న వారే లేకుండా పోయారు. చివరకు పార్టీలో చేరిన రోజు మాత్రమే జగన్ వాళ్లకు అపాయింట్ మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత వాళ్లను జగన్ కాదు కదా.. కనీసం జిల్లాలో నేతలు కూడా పట్టించుకోవడం లేదు. అయితే చాలా రోజుల తర్వాత శిద్ధా బయటకు వచ్చారు. ఆయన చంద్రబాబును విమర్శిస్తూ జగన్‌ను ప్రశంసించారు.

ఏపీ జనాలు జగన్ ఎప్పుడు ఏ కొత్త పథకం ప్రవేశ పెడతారా ? అని చూస్తున్నారని అన్నారు. రాష్ట్ర విభజన అనంతరం చంద్రబాబు నిర్వాకంతో నవంబర్ ఒకటో తేదీ ప్రాధాన్యత తగ్గిపోయిందన్నారు. ఇలా చంద్రబాబు చేసిన పొరపాటును సీఎం జగన్ సరిదిద్ది ఆర్యవైశ్యుల ఆత్మగౌరవం కాపాడారని రాఘవరావు అన్నారు. ఏదేమైనా ఏదో పదవిపై గురిపెట్టి జగన్ దృష్టిలో పడేందుకు ఇప్పుడు ఆయన భజన చేస్తున్నారని వైసీపీ వాళ్లే గొణుక్కుంటున్నారు.
Discussion about this post