జగన్ సర్కార్ డబ్బులు చేసుకునేందుకు కొత్త దారులు వెతుకుతోంది. పంచుడు పేరిట భారీ ఎత్తున హడావుడి చేసిన ప్రభుత్వం ఖజానా ఖాళీ కావడంతో అప్పులు ఎక్కడా పుట్టకపోవడంతో ఏకంగా జనాల మీదనే పడుతోంది. దాంతో అసలే కరోనా కాటుతో నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్న ప్రజల నెత్తిన అదనపు భారాలు పడుతున్నాయి. నిన్న ఆస్తిపన్నును ఏకంగా విలువ ఆధారిత టారిఫ్ తో పదిహేను శాతంగా పెంచేసి నడ్డి విరగ్గొట్టిన జగన్ సర్కార్ సరికొత్త పధకంగా ఉచిత కరెంట్ షాక్ ని అమలులో పెడుతోంది. దీని వల్ల సగటు వినియోగదారుడి నెత్తిన కచ్చితంగా వంద రూపాయల దాకా అదనపు భారం పడే అవకాశం ఉంది.
ఇంధన సర్దుబాటు చార్జీల కింద భారీ వడ్డనకు ఏకంగా విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ కి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. గతంలో అయితే ఏడాది కోసారి ఈ సర్దుబాటు చార్జీలు ఉండేవి.అది కూడా ప్రజాభిప్రాయాన్ని తెలుసుకుని దానికి అనుగుణంగా తగ్గింపులకు కూడా వీలు ఉండేది. ఇపుడు అలా కాకుండా ప్రతి మూడు నెలలకు ఈ సర్దుబాటు చార్జీల వడ్డన ఉండబోతోంది. దీని వల్ల ఎక్కువగా నష్టపోయేది సామాన్యులు, మధ్యతరగతి వర్గాలే అని అంటున్నారు
మామూలుగా మధ్యతరగతి ఇళ్ళల్లో కచ్చితంగా నెలకు రెండు వందలకు పైగా యూనిట్లు వాడకం ఉంటుంది. ఈ అదనపు వడ్డన వల్ల ప్రతీ యూనిట్ కి యాభై పైసలు వసూలు చేస్తారు. దాంతో ప్రతీ పేద, మధ్యతరగతి బడ్జెట్ నుంచి వంద రూపాయలు నెలకు విద్యుత్ షాక్ రూపంలో పట్టుకుపోతారన్నమాట. ఈ విధంగా ఏడాదికి రెండు వేల కోట్ల రూపాయలను పోగు చేసుకోవాలన్న విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ ఆలోచనలకు జగన్ సర్కార్ ఆమోదం తెలిపింది. ఇది నిజంగా దారుణమే అంటున్నారు. గతంలో ఇంధన సర్దుబాటు రూపేణా ఏమైనా అదనపు నిధులు అవసరం అయితే పేదలపైన భారం పడకుండా ప్రభుత్వాలు కూడా సర్దుబాటు చేసే అవకాశాలు ఉండేవి.
ఇపుడు ప్రతీ మూడు నెలలకూ అన్న విధానం అమలు చేయడం వల్ల ఎలాంటి జాప్యం లేకుండా రెగ్యులేటరీ కమిషన్ హాయిగా వసూల్ చేసుకుంటుంది. ఆ మేరకు ప్రభుత్వం మీద కూడా ఏ బాధా, బాధ్యత లేకుండా నిశ్చింతగా ఉంటుంది. మొత్తానికి జనాల మీద బాదుడుకు వైసీపీ సర్కార్ పూనుకోవం పట్ల విపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాయి.
Discussion about this post