తెలుగుదేశం పార్టీలో నాయకుల మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. అసలే పార్టీ కష్టాల్లో ఉంటే, ఇంకా వారి విభేదాల పార్టీ మరింతగా కష్టాల్లోకి వెళుతుంది. ఇప్పటికే సీనియర్ నాయకుడు బుచ్చయ్య చౌదరీ పార్టీలో ఉన్న లోపాలని ఎత్తిచూపి పార్టీని కాస్త గాడిలో పెట్టడానికి అలకపాన్పు ఎక్కారు. పార్టీలో కార్పొరేట్ తరహా రాజకీయం నడుస్తోందని, నిజమైన కార్యకర్తలకు న్యాయం జరగట్లేదని, ఈ విషయంపై చంద్రబాబు ఫోకస్ పెట్టి పని చేయాలని బుచ్చయ్య మాట్లాడారు.

అయితే బుచ్చయ్య పార్టీకి రాజీనామా చేస్తానని చెప్పడం, చంద్రబాబు, ఇతర టిడిపి నేతలు బుజ్జగించడం చేశారు. దీంతో కాస్త బుచ్చయ్య వ్యవహారం సర్దుకుంది. ఇక ఇప్పుడు పార్టీలో జేసి ప్రభాకర్ రెడ్డి మరో రచ్చకు తెరదీశారు. బుచ్చయ్య మాదిరిగానే పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీలో కార్యకర్తలని పట్టించుకోవడం లేదని, చాలామంది నాయకులపై పార్టీ కార్యకర్తలకు విశ్వాసం లేదని మాట్లాడారు. అలాగే అనంతపురంలో ఇద్దరు టిడిపి నేతల వల్ల పార్టీ నాశనమవుతుందని అన్నారు.

అయితే మామూలుగా ఏ మీడియా సమావేశంలో ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటే, పెద్ద రచ్చ అయ్యేది కాదు. రాయలసీమ టిడిపి నేతలంతా ఒకచోట చేరి, నీటి ప్రాజెక్టుల విషయంలో సమావేశం జరుగుతుండగా అక్కడకు వెళ్ళి మరీ ఇలా మాట్లాడారు. దీంతో మొత్తం రివర్స్ అయింది. జేసి ప్రభాకర్‌పై సొంత నేతలే ఫైర్ అవుతున్నారు. పల్లె రఘునాథ్, పయ్యావుల కేశవ్, పరిటాల సునీత, జితేంద్ర గౌడ్, ఉమా మహేశ్వరనాయుడు ఇలా అనంతపురం నేతలు వరుసగా జేసిపై ఫైర్ అయ్యారు. అసలు జేసి మాట్లాడే సందర్భం అది కాదని అన్నారు.

ఇక మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరీ అయితే ఒక అడుగు ముందుకేసి…జేసి వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని, ఒకసారి జగన్‌ని పొగడటం, టిడిపిని తిట్టడం చేస్తున్నారని, వైసీపీతో ములాఖత్ అయ్యారని, కార్యకర్తలని నాయకులు బాగానే చూసుకుంటున్నారని కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇలా అనంతలో సైకిల్ నాయకుల మధ్య రచ్చ జరుగుతుంది. ఇక ఈ రచ్చకు చంద్రబాబు బ్రేక్ వేయాల్సి ఉంది.

Discussion about this post