విశాఖ ఉక్కు కర్మాగారం అంటేనే ఏపీకి గర్వకారణంగా చెబుతారు. విభజన తరువాత ఏపీకి మిగిలిన అతి పెద్ద పారిశ్రామిక సంస్థ ఇది. ప్రభుత్వ రంగంలో ఉన్న విశాఖ స్టీల్ వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపుగా అయిదు నుంచి పది లక్షల మంది ఉపాధిని పొందుతున్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినదించిన గొంతులు ఇంకా గంభీర సాగరానికి గుర్తే. అలాగే కో అంటే కో అంతే ఎత్తైన విశాఖ కొండలు సైతం అచ్చెరువందేలా అయిదు దశాబ్దాల క్రితం విశాఖలో ఉవ్వెత్తున పోరాటాలు స్టీల్ ప్లాంట్ కోసం జరిగాయి.
ఇక విశాఖ ఆర్ధిక రాజధాని అని చంద్రబాబు అంటే కాదు పరిపాలనా రాజధాని అని జగన్ అన్నారు. నాడు పెట్టుబడుల సదస్సులు విశాఖలో పెద్ద ఎత్తున నిర్వహించి చంద్రబాబు ఈ ప్రాంతాన్ని హైలెట్ చేశారు. ఇపుడు జగన్ పాలనా రాజధాని విశాఖ, అన్నీ అక్కడే. అంతా అక్కడే అంటూ ఆర్భాటం చేస్తున్నారు. మరి విశాఖకు మణి దీపం లాంటి ఉక్కు కర్మాగారం లేకుండా ఆ వైభవం వస్తుందా. విశాఖ గురించి చెప్పాలంటే ముందుగా ఉక్కు కర్మాగారం గురించే కదా ప్రస్థావించాలి. ఈ సంగతి ఏపీని ఏలిన ప్రభువులకు తెలియదా..!
విశాఖను ప్రైవేట్ పరం చేయడానికి కేంద్రంలోని బీజేపీ సర్కార్ దూకుడుగా అడుగులు ముందుకు వేస్తూంటే అధికార వైసీపీ కానీ విపక్ష టీడీపీ కానీ ఈ వైపునకు తొంగి చూడడంలేదు. వంగి వాలడంలేదు. పోరాటం అంతా వామపక్షాలకే అప్పచెప్పేసి తాము మాత్రం ఫుల్ సైలెంట్ అయ్యారు. విశాఖలో ముప్పయి అయిదు కిలోమీటర్ల భారీ ర్యాలీని ఉక్కు కార్మికులు తాజాగా నిర్వహిస్తే హాజరైంది ఒక్క వామపక్ష పార్టీల నేతలు మాత్రమే. మరి విశాఖలో ఎక్కడ చూసినా స్టీల్ కార్మికులు వారి కుటుంబాలు ఉంటాయి. వారి ఓట్లతోనే ప్రధాన పార్టీలు ఎవరైనా గద్దెనెక్కేది.
జీవీఎంసీ ఎన్నికల వేళ మాత్రం అటు టీడీపీ నిరాహార దీక్షలతో హీటెక్కిస్తే, పాదయాత్రతో వైసీపీ కదం తొక్కింది. మరిపుడు ఆ దూకుడు ఏమైంది అని ఉక్కు కార్మికులు అడుగుతున్నారు. కనీసం సంఘీభావం తెలియచేయడానికి కూడా తీరిక లేదా అంటూ టీడీపీ, వైసీపీ నేతలను ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి స్టీల్ ప్లాంట్ వంటి బంగారు బాతు గుడ్డుని కేంద్రం ప్రైవేట్ కి అప్పగించాలని చూస్తూంటే బలమైన ప్రధాన పార్టీలు చోద్యం చూస్తున్నాయి. దీంతో బీజేపీ పని సులువు అయింది అంటున్నారు. ఒక్కటి మాత్రం నిజం.స్టీల్ ప్లాంట్ ని ఏపీకి కాకుండా చేస్తే మాత్రం ఆ పాపాలు, శాపాలు ప్రధాన పార్టీల భరించాల్సి ఉంటుందని ఉక్కు కార్మిక లోకం హెచ్చరిస్తోంది.
Discussion about this post