ఏపీలోని ఉద్యోగులు ఏ మాత్రం సంతోషంగా లేరు. జగన్ సర్కార్ విషయంలో వారు తమ ఆగ్రహాన్ని బాహాటంగానే చాటుతున్నారు. ఆఖరుకు వారి పరిస్థితి ఎంతవరకూ వచ్చింది అంటే నెల జీతాలకు కూడా ఠికాణా లేనంతగా సీన్ ఉంది. ప్రతీ నెలా ఒకటవ తారీఖున ఠంచనుగా పడాల్సిన జీతాలు ఇపుడు ఏ రోజు వస్తాయో తెలియని పరిస్థితి. గత ఏడాది కరోనా మొదటి దశతో మొదలైన జీతాల లేట్ కాస్తా ఇపుడు అలవాటుగా మారిపోయింది. ఒక్కోసారి పదిహేనవ తారీఖు దాటినా కూడా జీతాలు అందుకోలేని పరిస్థితిని చూసి ప్రభుత్వ ఉద్యోగులు తామేమి పాపం చేశామని కుమిలిపోతున్నారు.
అంతే కాదు పీయార్సీ ఈ ప్రభుత్వం ఉండగా మరచిపోవాల్సిందే అన్న మాట కూడా వినిపిస్తోంది. 11వ వేతన సవరణ తెలంగాణాలో జరిగిపోయింది. సాటి తెలుగు ఉద్యోగులు అక్కడ ఇబ్బడి ముబ్బడిగా జీతాలు అందుకుంటూంటే ఇక్కడ మాత్రం నెల జీతానికే భరోసా లేని పరిస్థితి ఉంది. మరో ముచ్చట కూడా ఇక్కడ చెప్పుకోవాలి. జగన్ అధికారంలోకి వచ్చాక కరవు భత్యం అన్న మాటను కూడా ప్రభుత్వ ఉద్యోగులు మరచిపోయారు. ప్రతీ ఆరు నెలలకు ఒకమారు విడుదల చేసే డీఏకు కూడా ఇపుడు ఏ మాత్రం అవకాశం లేకుండా పోయిందని గగ్గోలు పెడుతున్నారు.ఇక డీఏల మీదనే పించనర్లు ఆధారపడతారు. వారికి ఏ మాత్రం పెన్షన్ డబ్బులు పెరిగినా కూడా డీఏ నుంచే. అలాంటిది రెండేళ్ళుగా దాన్ని ఇవ్వలేదు. పాత వాటితో కలుపుకుని మొత్తం ఆరేడు విడతల డీఏ అలా పెండింగులో ఉండిపోయింది అంటున్నారు. మరి ఇవన్నీ ఇపుడు జగన్ సర్కార్ చెల్లిస్తుందో ఎవరికీ తెలియదు. ఉద్యోగ సంఘాల నేతలు కూదా ప్రభుత్వ వైఖరి చూసి బయటకు అడగడం మానుకున్నాయి. అయితే వారంతా లోలోపల రగులుతున్నారు. డీఏలు సకాలంలో ఇవ్వకపోవడం వల్ల నష్టం ఎక్కువగా వాటిల్లేది పెన్షనర్లకే.
ఇలా పెరిగిన డీఏ అందుకోకుండానే చాలా మంది పెన్షనర్లు కాలం చేశారు. మిగిలిన వారు కూడా చకోర పక్షుల్లా ఎదురు చూస్తున్నారు. ఇవన్నీ కలసి జగన్ సర్కార్ మీద ఉద్యోగుల కోపం రెట్టింపు అవుతోంది. మా తడాఖా చూపిస్తామని అపుడే వారు ప్రతిన చేస్తున్నారు. ఉద్యోగుల దెబ్బ ఎలా ఉంటుందో గత ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయి. జగన్ జాగ్రత్త పడకపోతే వచ్చే ఎన్నికల్లో ముందుగా ఉద్యోగులే అతి పెద్ద విలన్లుగా మారి కొంప కొల్లేరు చేస్తారని అంటున్నారు.
Discussion about this post