కళా వెంకట్రావు….టిడిపి సీనియర్ నాయకుడు…తెలుగుదేశం పార్టీ పెట్టిన దగ్గర నుంచి పనిచేస్తున్న నాయకుడు. మధ్యలో ప్రజారాజ్యంలోకి వెళ్లొచ్చినా, ఆయనకు టిడిపిలో ప్రాధాన్యత తగ్గలేదు. చంద్రబాబు, ఆయనకు ఏపీ టిడిపి అధ్యక్ష పదవి ఇచ్చారు…అలాగే 2014లో ఎచ్చెర్ల నుంచి గెలిచిన కళాని క్యాబినెట్‌లోకి కూడా తీసుకున్నారు. ఇక 2019 ఎన్నికల్లో కళా ఓటమి పాలయ్యారు. అలాగే అధ్యక్ష పదవిని సైతం అచ్చెన్నాయుడుకు ఇచ్చారు.

అయితే కళా తన నియోజకవర్గంలో మళ్ళీ పికప్ అవ్వాలని చూస్తున్నారు. ఇప్పటికే అధికార వైసీపీపై నిదానంగా వ్యతిరేకత పెరుగుతుండటంతో తనకు కలిసొస్తుందని అనుకుంటున్నారు. కానీ నియోజకవర్గంలో ఉన్న గ్రూప్ తగాదాలు వల్ల పార్టీకి ఇబ్బందికర పరిస్తితులు వస్తున్నాయి. అధికారంలో ఉన్నన్ని రోజులు ఈ రచ్చ ఏమి బయటపడలేదు. కానీ ఎప్పుడైతే అధికారం కోల్పోవడం, కళా ఓటమి పాలవ్వడం జరిగాయో అప్పటి నుంచి ఎచ్చెర్లలో అసలు రచ్చ మొదలైంది.

ఎచ్చెర్లలో కొందరు టిడిపి కార్యకర్తలు కళా నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నట్లు కనిపిస్తోంది. అదే సమయంలో కళాకు ప్రత్యామ్నాయంగా కలిశెట్టి అప్పలనాయుడు సైతం ఎదుగుతున్నారు. ఆయన కూడా నియోజకవర్గంలో సెపరేట్‌గా కార్యక్రమాలు చేస్తున్నారు. నెక్స్ట్ టికెట్ దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కొందరు కార్యకర్తలు ఆయన వెంట తిరుగుతున్నారు. అయితే కలిశెట్టికి చెక్ పెట్టి, కార్యకర్తలని తనవైపుకు తిప్పుకోవాలని కళా గట్టిగానే ప్రయత్నిస్తున్నారు.

ఈ క్రమంలోనే కలిశెట్టిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు రెండుసార్లు ప్రకటించారు. అయినా సరే కలిశెట్టి మాత్రం నియోజకవర్గంలో టిడిపి జెండా పట్టుకుని పనిచేస్తూనే ఉన్నారు. అటు కొందరు కార్యకర్తలు కూడా ఆయనకు సపోర్ట్ చేయడంతో, ఎచ్చెర్ల టిడిపి కళ తప్పేలా కనిపిస్తోంది. దీనిపై చంద్రబాబు ఫోకస్ చేసి, నాయకులని సమన్వయం చేసి, ఎచ్చెర్లలో టిడిపిని లైన్ చేయాల్సిన అవసరముందని మరికొందరు కార్యకర్తలు కోరుతున్నారు. లేదంటే ఈ పోరు ఇలాగే నడిస్తే టిడిపి కొంపమునగడం ఖాయమని అంటున్నారు.

Discussion about this post