ఎమ్మెల్సీ ఎన్నికల్లో బోగస్ ఓట్లు, అక్రమాలపై చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌కు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. వైసీపీ నేతలతో పలు చోట్ల ఎన్నికల అధికారులు కుమ్మక్కుతో పెద్ద ఎత్తున బోగస్ ఓట్ల నమోదు అయ్యాయని అని ఫిర్యాదు చేశారు. వివిధ ప్రాంతాల్లో పట్టుబడిన బోగస్ ఓట్ల వివరాలను లేఖకు జత చేసి పంపించారు . ‘‘బోగస్, నకిలీ ఓట్లను ఓటర్ల జాబితాలో చేర్చడం వల్ల ఎన్నికల ప్రక్రియ అపహాస్యం అవుతోంది. గతంలో తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికల్లో కూడా బోగస్ ఓట్ల తంతు నడిచింది. పట్టభద్రుల, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా నేడు అదే పునరావృతం అవుతుంది.

డిగ్రీ చదవని వ్యక్తులు, నకిలీ సర్టిఫికేట్‌లతో ఓటర్లుగా నమోదు చేయబడ్డారు. తప్పుడు చిరునామాలతో వైసీపీ అభ్యర్థికి అనుకూలంగా పెద్ద సంఖ్యలో ఓటర్లను చేర్చారు. తిరుపతిలో ఒకే ఇంటి చిరునామాతో పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బోగస్ ఓట్లు చేర్పించారు. ఎన్నికల అధికారులు అధికార పార్టీ నేతలతో కుమ్మక్కయ్యి నకిలీ డిగ్రీ సర్టిఫికెట్ తో ఓటర్లుగా చేరారు. కొందరు అధికారులు నకిలీ పత్రాలను పై పరిశీలన జరపకుండానే, ఉద్దేశ్య పూర్వకంగానే ఆమోదం తెలిపారు. తిరుపతిలో 44వ డివిజన్‌లో చికెన్ దుకాణం అడ్రస్‌తో కూడా 16 బోగస్ ఓట్లు నమోదు చేశారు. ఇలా పలు ప్రాంతాల్లో బోగస్ ఓట్ల తంతు ఉంది. బోగస్ ఓట్లపై విచారణ జరపాలని ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి సంబంధిత జిల్లా కలెక్టర్‌ను ఆదేశించినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ బోగస్, నకిలీ ఓట్లతో ప్రజాస్వామ్య విలువలకు, ప్రాథమిక హక్కులకు తీవ్ర నష్టం కలుగుతుంది. ఈ కారణంగా తక్షణ చర్యలు తీసుకోవాలి.. అక్రమాలను అడ్డుకోవాలని.. బోగస్ ఓట్ల నమోదులో పాల్గొన్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసే విధంగా మీరు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ లేఖలో చంద్రబాబు’’ ప్రస్తావించారు.
