విశాఖ ఇపుడు కూల్ సిటీ కాదు, హీట్ సిటీ. ఎదురుగా గంభీర సాగరం ఉంది. ఆహ్లాదకరమైన పరిసరాలు చుట్టూ ఉన్నాయి. విశాఖ లో అంతా నెమ్మదిగా మంచిగా ఉంటారు అనుకుంటే పొరపాటే. అవును మరి. నీతి అయోగ్ వైస్ చైర్మన్ అమితాబ్ కాంత్ విశాఖ వస్తే ఆయన కారుని స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు అడ్డుకున్నారు. అంతే కాదు ఆయన బస చేసిన బంగళా వద్దకు వెళ్ళి నినాదాలు చేశారు. విశాఖలో అడుగుపెట్టవద్దు అంటూ గర్జించారు. అసలు ఇంతకీ ఎందుకీ ఆగ్రహం అంటే విశాఖ ప్లాంట్ ప్రైవేటేజేషన్ గురించే అంటున్నారు. బంగారం లాంటి ప్లాంట్ ని తీసుకెళ్ళి ప్రైవేట్ పరం చేస్తామంటే ఎవ్వరికి మాత్రం కోపం రాదు. దాంతో ఢిల్లీ నుంచి ఎవరు వచ్చినా కూడా మేము ససేమిరా ఒప్పుకోమని అంటున్నారు.

చేయాల్సింది అంతా చేసి ఇపుడు తాపీగా విశాఖ వస్తారా. మేము ఎలా ఉన్నామో చూడడానికి వస్తారా అంటూ ఒక్క లెక్కన మండిపోతున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు నీతి అయోగ్ సలహాలు కూడా కారణమని ప్లాంట్ ఉద్యోగులు అనుమానిస్తున్నారు. మా బతుకులు రోడ్డు మీద వేసి మీరు చల్లగా ఉంటే మేము గరం గరం అవుతామని కూడా గట్టిగానే తాఖీదులు ఇస్తున్నారు. మొత్తానికి అనూహ్యంగా నీతి అయోగ్ విశాఖ పర్యటన ఉద్రిక్తం కావడం మాత్రం ఏపీతో పాటు ఢిల్లీలోనూ పెద్ద ఎత్తున చర్చగానే ఉంది.

అయినా ఇపుడే ఏమైంది, ముందుంది ముసళ్ళ పండుగ అంటున్నారు. రానున్న రోజుల్లో ప్లాంట్ ని చూసుకోవడానికి మరింత మంది వస్తారు. అపుడు ఇంతకు మించి ఆందోళను చేస్తామని అంటున్నారు. అదే విధంగా ఎట్టి పరిస్థితులలోనూ ప్లాంట్ ని ప్రైవేట్ పరం కానివ్వమని కూడా శపధం చేస్తున్నారు. టాటా అయినా బిర్లా అయినా అదానీ అయినా మాకు సంబంధం లేదు. ఎవరొచ్చినా ప్లాంట్ గేటుని కూడా తాకనివ్వమని ఉక్కు కార్మికులు చెబుతూంటే ఉద్యమమే వారిని అలా ఉక్కులా మార్చిందనుకోవాలేమో. మొత్తానికి విశాఖ ఉక్కు పరిశ్రమను అంత తేలికగా బలివ్వమని వారు అంటున్న మాటలు ఢిల్లీ ప్రభువులు తప్పక చెవికి ఎక్కించుకోవాల్సిందే.
Discussion about this post