ఉమ్మడి ఏపీ రెండుగా విభజించాకా రాష్ట్రానికి తీరని అన్యాయమే జరిగింది. ఉమ్మడి ఆస్తుల విభజన ఈ రోజుకీ జరగలేదు. మరో వైపు చూస్తే సంపన్న రాష్ట్రంగా తెలంగాణా ఉంటే ఏపీ అప్పుల కుప్పగా మారుతోంది. ఈ నేపధ్యంలో కేంద్రంతో తరచూ చర్చలు జరిపో డిమాండ్ చేసో ఏపీకి న్యాయంగా రావాల్సిన ఆస్తులను దక్కించుకోవాలి. కానీ జగన్ ఆ పని చేయడంలేదు అన్న మాట ఉంది. అధిక వడ్డీలు ప్రతీ నెలా తీసుకువచ్చి ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్న జగన్ వేల కోట్ల రూపాయలు తెలంగాణా నుంచి అతి పెద్ద బకాయిగా రావాల్సి ఉన్నా కూడా కిమ్మనడంలేదు అంటున్నారు.
విపక్షాలు చెప్పినట్లుగా జగన్ అధికారంలోకి వచ్చాక తెలంగాణాకు ఎన్నో రకాలుగా ప్రయోజనం కలిగిందనే చెప్పాలి. వచ్చే రావడంతోనే తెలంగాణాలోని కొన్ని కీలకమైన భవనాల మీద ఉన్న హక్కులను వదిలేసుకున్నారు. ఇక విద్యుత్ బీల్లుల కింద ఏడు వేల కోట్ల రూపాయలను తెలంగాణా చెల్లించాల్సి ఉంది. దాని గురించి కనీసం డిమాండ్ చేయడంలేదు. మరో వైపు చూస్తే గోదావరి నీటిని మళ్ళించి తెలంగాణా కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టేసుకుంది. మరి పోలవరం రేపటి రోజున కట్టినా కూడా వరదలలో తప్ప గోదావరి నీళ్ళు మొత్తం వస్తాయని చెప్పడానికి లేదు.
దానికి ఎపుడూ అడ్డు చెప్పకపోగా ఇపుడు శ్రీశైలం రిజర్వాయర్ నీటితో విద్యుత్ ఉత్పత్తిని చేస్తున్నా ఏమనలేని పరిస్థితి ఉంది అంటున్నారు.
ఈ నేపధ్యంలో కూడా తెలంగాణా మీద తాము పోరాడమనే జగన్ చెబుతున్నారు. నీటి రాజకీయాలు చేయద్దు అని కేసీఆర్ కి సుతి మెత్తగా సూచిస్తున్నారు. మరో వైపు కేంద్రానికి లేఖలు రాస్తున్నారు. అయితే కేసీఆర్, జగన్ ల మధ్య ఉన్న బలమైన స్నేహన్ని చూసి కేంద్ర పెద్దలు ఆయన లేఖలకు రెస్పాండ్ అవడంలేదు అంటున్నారు. ఏది ఏమైనా రాజకీయాలే పరమావధిగా జగన్ తెలంగాణాతో మిత్రుత్వం నెరుపుతున్నారు అన్న భావన అయితే ఉంది.
Discussion about this post