జగన్ తాను మంచి పారిశ్రామికవేత్తగా చెప్పుకుంటారు. మరి ఆయన ఏలుబడిలో ఒక్క పరిశ్రమ కూడా ఏపీకి రాలేదు. అంతే కాదు ఉన్న పరిశ్రమలు కూడా బయటకు పోతున్నాయి. వాటికి ఇలా పట్టేసి అలా తమ ప్రాంతంలో పెట్టేసుకుంటోంది పొరుగున ఉన్న తెలంగాణా. మరి ఏపీలో పారిశ్రామిక వాతావరణం మీద నీలి నీడలు కమ్ముకోవడానికి కారణాలు ఏంటి అన్న చర్చ అయితే అందరిలో ఉంది. దానికి ప్రభుత్వ విధానాలే అని కూడా మేధావులు చెబుతున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా జగన్ సర్కార్ అస్థిరమైన అనాలోచితమైన ఆలోచనలే ఏపీకి పరిశ్రమలు కానీ కొత్త పెట్టుబడులు కానీ రాకుండా చేస్తున్నాయి అంటున్నాయి.
ఈ రోజుకు కూడా ఏపీకి రాజధాని అంటే ఏంటో చెప్పలేని స్థితిలో వైసీపీ సర్కార్ ఉంది. నాడు విపక్ష నేతగా ఉన్నపుడు అమరావతి రాజధానికి జై కొట్టిన జగన్ సీఎం అయ్యాక మాత్రం మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకువచ్చారు. అది ఆచరణలో అసలు అయ్యేది కాదు, దాని వెనక ఎన్నో ఇబ్బందుకు అవరోధాలూ ఉన్నాయి. పైగా అది ధర్మబద్ధమైనది కాదు, నైతికపరంగా చూసినా కూడా తప్పు అనే అంటున్నారు. ఇపుడు మూడు రాజధానుల అంశం హై కోర్టు ముందు విచారణలో ఉంది. అది జరిగి తీర్పు రావాలి అంటే చాలా కాలమే పడుతుంది అంటున్నారు.మరో వైపు చూసుకుంటే విశాఖకు ఏదో రోజున తరలి వెళ్ళిపోతామని జగన్ సర్కార్ అమరావతి గురించి అసలు పట్టించుకోవడం మానేసింది. నిజానికి చంద్రబాబు గద్దె దిగేసమయానికి అమరావతి రాజధానికి చాలా మటుకు హంగులు సమకూర్చి పెట్టారు. అంటే ఒక విధంగా తొంబై శాతం పనులు పూర్తి అయ్యాయి. వాటిని మరో పది శాతం కనుక జగన్ ప్రభుత్వం పూర్తి చేసి ఉంటే ఈపాటికి పెద్దగా ఖర్చు లేకుండా ఏపీకి అమరావతి ధీటు అయిన రాజధానిగా ఉండేది. కానీ వైసీపీ పెద్దలు మాత్రం అమరావతి మీద అనవసర వ్యతిరేకతను పెంచుకున్నారు. దాంతో విలువైన రెండేళ్ల కాలం వేస్ట్ గా పోయింది. మరి పారిశ్రామికవేత్తలు ఈ రకమైన అస్థిరతను చూసి ఎందుకు పెట్టుబడులు పెడతారు అన్న ప్రశ్న ఉదయిస్తోంది.
ఒక ప్రభుత్వం గత ప్రభుత్వం తీసుకున్న కీలకమైన మౌలికమైన నిర్ణయాలను ఆమోదిస్తూ కొనసాగించడం ఇంతవరకూ అంతా చూశారు. గతంలో ఉమ్మడి ఏపీలో కూడా టీడీపీ తరువాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇలా ముఖ్యమైన విధాన నిర్ణయాలను తిరగతోడలేదు. అలాంటిది ఏకంగా రాజధానినే లేపేయాలని జగన్ సర్కార్ ఎవరి ఊహకూ అందని నిర్ణయం చేసింది. దాని ఫలితాలు, పర్యవశానాలే ఇపుడు ఏపీ మొత్తం అనుభవిస్తోంది అంటున్నారు. అదెలా అంటే ఈ రోజు విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు వచ్చిన రేపటి రోజున అది రాజధాని కాదు అంటే అపుడు వారి గతేంటి. ఇలా ఏపీలో పాలసీ పరంగా ఉన్న ఇబ్బందులే పెట్టుబడులు రాకుండా చేస్తున్నాయని అంటున్నారు. దీనికి నూరు శాతం బాధ్యత వైసీపీ సర్కారే వహించాలని మేధావులు కూడా అంటున్నారు.
Discussion about this post