రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయం లేనట్టేనా? ప్రస్తుత పరిస్థితిలో చంద్రబాబుదే హవా కొనసాగుతుం దా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. నిజానికి వైసీపీ అధినేత జగన్ కనుక అధికారం కోల్పోయి.. కేసుల ప్రభావంతో ఏదైనా జరిగి జైలుకు వెళ్తే.. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తులు పుంజుకుంటాయని అందరూ భావిస్తున్నారు. అయితే.. ఈ దిశగా అడుగులు వేయాల్సిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న వైఖరితో మేధావులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ పుంజుకునే పరిస్థితి లేదని.. ఇప్పట్లో జనసేనపై ఆశలు లేనట్టేనని వారు చెబుతున్నారు.
ఈ క్రమంలో రాష్ట్రంలో టీడీపీ తర్వాత మరో బలమైన పార్టీ పుంజుకునే అవకాశం లేదని అంటున్నారు. ఇదే విషయంపై సమగ్ర పరిశీలన చేసిన చంద్రబాబు.. తనకు రాజకీయం సేఫేనని బావిస్తున్నారు. వాస్తవానికి పవన్ పుంజుకుని ఉంటే.. బీజేపీ కూడా అంతో ఇంతో బలోపేతం అయి ఉండేది. అదేసమయంలో కాంగ్రెస్ కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేసి ఉంటే.. పరిస్థితి మారేది కానీ.. ఇప్పట్లో పవన్ పుంజుకునే పరిస్థితి కనిపించడం లేదు. పైగా ఆయన పార్టీని ఉంచుతారో.. బీజేపీలో విలీనం చేస్తారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఒకవేళ విలీనం చేస్తే.. బీజేపీ పుంజుకునే అవకాశం ఉంది. కానీ, విలీనం చేసే ప్రతిపాదన వచ్చినా.. పవన్.. బ్యాడ్ నేమ్ వస్తుందనే భయంతో వెనుకంజ వేస్తున్నారు.
ఈ క్రమంలో టీడీపీకి ఉన్న అవకాశం చెక్కుచెదరని చంద్రబాబు భావిస్తున్నారు. పార్టీ ఇప్పుడు ఒకింత ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నా.. మున్ముందు పుంజుకుంటుందని బాబు భావిస్తున్నారు. ప్రత్యామ్నా యంగా వైసీపీని ఎదుర్కొనే శక్తి ఒక్క టీడీపీకి మాత్రమే ఉంటుందని.. ప్రజలు కూడా టీడీపీ వైపు మొగ్గు చూపించడం ఖాయమని చంద్రబాబు పార్టీ అంతర్గత చర్చల్లో సైతం చెబుతున్నారు. అంటే.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయం దక్కించుకునేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయని.. తమ్ముళ్లలో ఆయన ధైర్యం చెబుతున్నారు. ఏదేమైనా.. ప్రత్యామ్నాయ రాజకీయాలు పుంజుకోనంత వరకు టీడీపీకి ఢోకాలేదని భావిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Discussion about this post