జగన్ సర్కార్ అధికారం మరో మూడేళ్ళు ఉంది. ఈ లోగా ఆయన ఒక్క ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా ఇవ్వలేరా. అంటే ఏపీలో ఉన్న రాజకీయ ఆర్ధిక పరిస్థితులు అదే నిజం అంటున్నాయి. ఏపీలో ఖాలీ ఖజానా వెక్కిరిస్తోంది. అదే టైమ్ లో కొత్తగా ఒక్క పరిశ్రమ కూడా రావడంలేదు. ఇక నిధులన్నీ సంక్షేమ పధకాల పేరిట పంచుడుకు ఖర్చు చేస్తున్నారు. అప్పులు తెచ్చి మరీ దుబారా చేస్తున్నారు. ప్రణాళికా వ్యయానికి, ప్రణాలికేతర వ్యయానికి మధ్య తేడా తెలియకుండా సర్కార్ పెద్దలు విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు. దాని ఫలితంగా ఆర్ధికంగా రాష్ట్రం దివాళా తీసిందనే విమర్శలు ఉన్నాయి.
ఈ నేపధ్యంలో దిన దిన గండం దీర్ఘాయిష్షు అన్నట్లుగా పాలన ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకే జీతాలు చెల్లించలేని స్థితిలో ప్రభుత్వం ఉంది. అమ్మో ఒకటో తారీఖు అని జగన్ సర్కార్ కలవరపడే పరిస్థితి ఉంది. దాంతో పాటు నవరత్నాలు, ఇతర హామీల కోసం పెడుతున్న ఖర్చుకు డబ్బుకు కావాలి. పించన్లు, ఇతర కార్యక్రమాలకు కూడా పెద్ద ఎత్తున సొమ్ము కావాలి. వచ్చిన దానికి జగన్ వచ్చినట్లుగానే పంచుడుకు కేటాయిస్తున్నారు అన్న మాట ఉంది. దీని మీద చంద్రబాబు టైమ్ లో అభివృద్ధి పనులు చేసి నేటికీ బిల్లులు అందని కాంట్రాక్టర్లు కోర్టుకు వెళ్తే కోర్టు కూడా ఇదేంటి అని గట్టిగానే అడిగింది. పంచుడుకు డబ్బుంది కానీ కాంట్రాక్టర్ల బకాయిలు తీర్చేందుకు లేవా అని కూడ ప్రశ్నించింది.
దీన్ని బట్టి చూస్తే ప్రభుత్వం వద్ద డబ్బులు ఉన్నా కూడా జగన్ హామీల కోసమే అవి వాడేస్తున్నారు. ఇక ఉన్న ఉద్యోగులకే జీతాలు ఇవ్వడానికి కటకటలాడుతూంటే కొత్తగా వేలాది ఉద్యోగాలు ఇస్తే వారికి జీతలు ఇవ్వడం అంటే తలకు మించిన భారమే. అందుకే జగన్ సర్కార్ ఈ విషయంలో జాబ్ లెస్ క్యాలండర్స్ నే చూపిస్తూ మభ్యపెడుతోంది అని విపక్షాలు అంటున్నారు. ఇక్కడ ఒక్క మాట ఉందని వారే అంటున్నారు.
జగన్ అధికారంలో ఉండగా ప్రభుత్వ ఉద్యోగాలు రావుట. మరి అదే నిజమైతే ఇప్పటికి రెండేళ్ళుగా యువత వేచి చూసి చూసి అలసిపోయింది. మరో మూడేళ్ళు వారి ఆకలితో అలా చూడాలి అంటే కష్టమే. వారిలో రేగే అసంతృప్తి కచ్చితంగా దావానలమే అవుతుంది. మరి ఆ పరిస్థితి వస్తే వైసీపీకి రాజకీయ ప్రమాదం ముంచుకు వచ్చినట్లే.
Discussion about this post