టీడీపీ అధికారంలోకి రావాలి. చంద్రబాబు మళ్లీ సీఎం పీఠం ఎక్కాలి. చిన్నబాబు.. మళ్లీ మంత్రో.. డిప్యూటీ సీఎమ్మో.. అయిపోవాలి.. రాష్ట్రం మొత్తం పుసుపు వర్ణ శోభితం అయిపోవాలి..!- ఇది చెప్పుకోవడానికి.. శీతలీకరణ (ఏసీ) గదుల్లో కూర్చుని కలలు కనేందుకు.. చాలా బాగుంటుంది. కానీ, క్షేత్రస్థాయిలోకి వస్తే.. నియోజకవర్గాల్లో అడుగు పెడితే.. పార్టీ పరిస్థితి ఎలా ఉందో.. నేతలు ఏం చేస్తున్నారో.. అర్ధం అవుతుంది.. అంటున్నారు పరిశీలకులు. టీడీపీకి ఇప్పుడు కావాల్సింది.. యువనేతలు. ఈ విషయంలో ఎవరూ రెండో మాట కూడా మాట్లాడడం లేదు.

అయితే..యువ నేతలు అంటే.. ఇప్పటికే కురువృద్ధులైన నాయకుల వారసులే.. యువ నేతలా? 2019లో యువతకు పెద్ద ఎత్తున అవకాశం ఇస్తున్నామని.. చెప్పుకొన్న చంద్రబాబు అవలంభించింది.. ఈ ఫార్ము లానే. వారసుల కుమారులు, కుమార్తెలకే ఆయన టికెట్లు ఇచ్చారు. దీంతో గెలిచిన వారు గెలవగా.. మూకు మ్మడిగా ఓడిన వారే ఎక్కువగా ఉన్నారు. ఒక్క రాజమండ్రి సిటీ నియోజకవర్గం నుంచి ఆదిరెడ్డి భవానీ మాత్రమే విజయం దక్కించుకున్నారు. సో.. దీనిని బట్టి.. వారసుల రాజకీయం పనికిరాదనే మినిమ్ ఫార్ములా.. అర్ధమైందా? అంటే.. ఇప్పటికీ పార్టీ అధినేతకు అర్ధం కాలేదు.మరి దీనికి మించిన వ్యూహం ఏదైనా ఉందా? పార్టీని పరుగులు పెట్టించే వ్యూహం వేయలేరా? అంటే.. వ్యూహాలు ఉన్నాయి.. గతంలో తీసుకున్న నిర్ణయాలు ఫలితాన్నీ ఇచ్చాయి. కానీ, ఆ తరహా వ్యూహలను ఇప్పుడు చంద్రబాబు అమలు చేయలేక పోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఉదాహరణకు.. 2014 ఎన్నికల విషయాన్ని తీసుకుంటే. చంద్రబాబు వారసులు కాని యువతకు కూడా టికెట్ ఇచ్చి సక్సెస్ అయ్యారు. అది కూడా బలమైన దగ్గుబాటి వెంకటేశ్వరరావు వంటి నాయకులు ప్రాతినిధ్యం వహించిన నియోజవకర్గం కావడం గమనార్హం.

ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గంలో.. చంద్రబాబు చేసిన ప్రయత్నం.. సక్సెస్ అయింది. పర్చూరులో అప్పటికి టీడీపీ నాయకులు గొట్టిపాటి నరసయ్య ఫ్యామిలీ బలంగా ఉండేది. అయితే.. జగన్‌పై మోజుతో.. ఈ కుటుంబం.. వైసీపీలోకి వెళ్లిపోయింది. దీంతో పార్టీ అనాథగా మారిపోయింది. ఈ సమయం లో యువకుడైన ఏలూరి సాంబశివరావుకు టికెట్ ఇచ్చారు. దీంతో ఆయన పర్చూరులో పార్టీని బలోపేతం చేశారు. నిరంతరం పార్టీ కోసం శ్రమించారు. ప్రతి ఒక్కరినీ కలుసుకున్నారు. ప్రతి విషయం లోనూ పార్టీని పుంజుకునేలా వ్యవహరించారు. నియోజకవర్గంలో పాదయాత్ర ద్వారా ప్రజలకు చేరువ అయ్యారు. అవకాశం కోసం ఎంతో కష్టపడే నేతలు అవకాశం వచ్చాక రిలాక్స్ మోడల్‌లోకి వెళ్లిపోతారు. కానీ ఏలూరు 2013లో ఏ స్థాయిలో కష్టపడ్డారో… ఇప్పుడూ అదే జోష్‌తో ఉన్నారు.స్థానిక ఎన్నికల్లో పార్టీని గెలిపించుకున్నారు. తర్వాత.. ఎమ్మెల్యేగా గెలిచారు. యువకుడిగా దూసుకుపో యారు. అంతేకాదు.. దగ్గుబాటికి అడుగడుగా చెక్ పెట్టారు. 2014తోపాటు.. 2019లో బలమైన వైసీపీ సునామీని సైతం తట్టుకుని.. సాంబశివరావు.. విజయం దక్కించుకున్నారు. గత ఎన్నికలకు ముందే ఆయన వ్యూహాన్ని.. గమనించిన చంద్రబాబు తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో ఆయనను వ్యూహకర్తగా పంపించి.. పార్టీని బలోపేతం చేసే చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం బాపట్ల పార్లమెంటరీ పార్టీ నియోజకవర్గం బాధ్యతలను కూడా ఏలూరికి అప్పగించారు. దీంతో ఆయన ఈ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ పార్టీని బలోపేతం చేసేందుకు విశేషంగా కృషి చేస్తున్నారు.

సో.. ఎలాంటి వారసత్వం లేని యువతకు పగ్గాలు అప్పగిస్తే.. వారిలో సత్తా బయటకు రావడమే కాకుండా.. పార్టీకి కూడా ఎంతో ప్రయోజనకరంగా మారిందనేది స్పష్టమైంది. మరి ఇప్పుడు.. ఏలూరి విషయంలో చేసిన సాహసం ఎందుకు చేయడం లేదు ? అనేది కీలక ప్రశ్న. 2014లో ఏలూరి స్ట్రాటజీని చంద్రబాబు ఎందుకు ప్రోత్సహించడం లేదు అనేది ప్రధాన సందేహం. ఇప్పటికైనా.. ఇలాంటి అంకిత భావంతో పనిచేసే యువ నాయకులను ఏరి ఎంచుకుని పగ్గాలు అప్పగిస్తే.. పార్టీ బలోపేతం అవుతుందని.. పైన చెప్పుకొన్న విధంగా తిరిగి అధికారం చేజిక్కుతుందని అంటున్నారు పరిశీలకులు. మరి బాబు ఏం చేస్తారో చూడాలి.
Discussion about this post