బాపట్ల పార్లమెంట్….గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఎక్కువసార్లు అండగా ఉన్న పార్లమెంట్ స్థానం. ఇక్కడ టీడీపీ అయిదుసార్లు గెలిచింది. గత ఎన్నికల్లో చాలా తక్కువ మెజారిటీతో పార్టీ ఓటమి పాలైంది. కేవలం 14 వేల ఓట్ల తేడాతో వైసీపీ గెలిచింది. అయితే రాష్ట్రంలో అంతటి జగన్ వేవ్‌లో కూడా ఇక్కడ వైసీపీకి తక్కువ మెజారిటీ రాకపోవడానికి కారణం లేకపోలేదు. ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్న నాలుగు అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ గెలిచింది. పర్చూరు, చీరాల, అద్దంకి, రేపల్లె స్థానాల్లో టీడీపీ సత్తా చాటింది. బాపట్ల, వేమూరు, సంతనూతలపాడుల్లో వైసీపీ గెలిచింది.
అయితే టీడీపీ ఇలా నాలుగు స్థానాల్లో గెలిచిన కూడా బాపట్ల పార్లమెంట్ ఓడిపోవడానికి కారణం క్రాస్ ఓటింగ్ అని అక్కడ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ టీడీపీ అభ్యర్ధిగా బరిలో దిగిన శ్రీరామ్ మాల్యాద్రి దూకుడుగా ఉండకపోవడమే. 2014లో గెలిచిన మాల్యాద్రి…ఆ ఐదేళ్లలో అంత మంచి పనితీరు ఏమి కనబర్చలేదని చెబుతున్నారు. అందుకే 2019 ఎన్నికల్లో కొందరు టీడీపీ కార్యకర్తలు ఈయనకు సీటు ఇవ్వకూడదని గట్టిగానే డిమాండ్ చేశారు. కానీ చంద్రబాబు చివరికి మాల్యాద్రికే సీటు ఇచ్చారు. నాలుగు పార్లమెంట్ స్థానాల్లో టీడీపీ గెలిచిన కూడా, క్రాస్ ఓటింగ్ ప్రభావంతో మాల్యాద్రి ఓటమి పాలయ్యారని చెబుతున్నారు. సరే ఓడిపోయాకైనా ఆయన బాపట్ల పార్లమెంట్ స్థానంలో పనిచేయడం లేదు.
ఎన్నికలైన దగ్గర నుంచి ఆయన అడ్రెస్ లేరు. అయితే బాపట్ల పార్లమెంట్ అధ్యక్షుడుగా పనిచేస్తున్న పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మాత్రం, పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారు. ఓ వైపు తన నియోజకవర్గంలో పార్టీని చూసుకుంటూనే, మరోవైపు మిగతా ఆరు స్థానాల్లో పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నారు. అయితే మాల్యాద్రి మళ్ళీ యాక్టివ్ అయ్యి, ఇప్పుడు నుంచి పనిచేసుకుంటే పార్టీకి బెన్‌ఫిట్ ఉంటుందని తమ్ముళ్ళు చెబుతున్నారు. అలా కాదంటే ఇన్‌చార్జ్‌ని మార్చేసి బలమైన నాయకుడుని బాపట్ల పార్లమెంట్‌లో నిలబెట్టాలని కోరుతున్నారు. ఏదేమైనా కంచుకోటలో టీడీపీని సెట్ చేయాల్సిన బాధ్యత చంద్రబాబుదే అంటున్నారు.
Discussion about this post