వైఎస్ జగన్ గెలుపు వెనక ఎన్నో అంశాలు కీలకమైన పాత్ర పోషించాయి. ఆయన తన పాదయాత్ర వల్లనే గెలిచాను అనుకుంటారు. నిజానికి అనేక విషయాలు దోహదపడబట్టే జగన్ ముఖ్యమంత్రి కాగలిగారు. జగన్ గురించి ఎక్కువగా ప్రచారం చేసి జనాలలో చైతన్యం తీసుకువచ్చిన వాటిలో మీడియా ప్రముఖ పాత్ర పోషించిన సంగతి విధితమే. మరీ ముఖ్యంగా చిన్న పత్రికలు జగన్ విజయాన్ని గట్టిగా కోరుకుని ప్రచారం చేశాయి. ఎక్కడికక్కడ స్థానికంగా ఉండే ఈ పత్రికలకు ఆయా ప్రాంతాలలో ఉన్న ఆదరణ ఎక్కువ. అందువల్ల ఆ పత్రికల్లో వచ్చిన వార్తలకు జనం ప్రభావమై జగన్ కి పట్టం కట్టారు అని చెప్పాలి. మరి జగన్ అధికారంలోకి వచ్చాక ఏం చేశారు. అవే చిన్న పత్రికల గొంతు కోశారు. రెండేళ్ళుగా రాష్ట్రంలో అక్రిడేషన్లు లేవు. హెల్త్ కార్డులు లేవు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి పని చేయలేదు. జర్నలిస్టులను అంతా సమాదరించారు. చంద్రబాబు హయాంలో హెల్త్ కార్డులు వచ్చాయి. బాబు మీడియాకు ఇచ్చిన ప్రాధాన్యత చాలా ఎక్కువ.
హెల్త్ కార్డుల వల్ల జర్నలిస్టులకు ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చినపుడు కార్పోరేట్ వైద్యాన్ని పైసా ఖర్చు లేకుండా చేయించుకునేవారు. జగన్ వచ్చాక హెల్త్ కార్డుల సంగతి పక్కన పెడితే అక్రిడేషన్లకే గతి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం అవుతోంది. అక్రిడేషన్ సంపాదించడం కంటే రాజ్య సభ సీటు దక్కించుకోవడమే సులువు అన్న అభిప్రాయం ఏర్పడింది అంటే ఎంత కఠినమైన నిబంధనలు జగన్ ప్రభుత్వం పెట్టింది అన్నది చూడాలి. చిన్న పత్రికలు ఏపీ వ్యాప్తంగా ఉన్నాయి. జర్నలిజాన్ని జీవనోపాధిగా చేసుకుని చాలా మంది బతుకులు వెళ్ళదీస్తున్నారు. కానీ అవే చిన్న పత్రికలకు జగన్ సర్కార్ విధానాలు గొడ్డలి పెట్టుగా మారాయి.
చిన్న పత్రికలకు అక్రిడేషన్లు రావాలి అంటే రెండేళ్ల జీఎస్టీ రిటర్న్స్ సమర్పించాలని నిబంధన విధించడంతో ఎవరికీ అక్రిడేషన్ కార్డు వచ్చే అవకాశం లేదు. కేంద్ర ప్రభుత్వం ఒక వైపు 40 లక్షల కంటే టర్నోవర్ ఏడాదికి ఉంటే జీస్టీ అవసరం లేదని ఒక వైపు ప్రకటించింది. కానీ చిన్న పత్రికలకు జీఎస్టీ కావాలట. ఆ రిటర్న్స్ చూపిస్తేనే అక్రిడేషన్లు ఇస్తారట. ఒక పత్రిక సవ్యంగా నడించిందో లేదో తెలుసుకోవడానికి ఇదే మార్గమని జగన్ భావించడం భావించడం నిజంగా దారుణం అంటున్నారు. ఇక చిన్న పత్రికలకు గతంలో ప్రకటనలు ఇచ్చి చంద్రబాబు పాలనలో ప్రోత్సహించేవారు. కానీ ఇపుడు మాత్రం ఒక్క ప్రకటన లేదు. ఎవరి శక్తి కొలది వారు తమ పత్రికలను నడుపుకుంటున్నారు.
అలాంటిది అక్రిడేషన్లు కూడా ఇవ్వమని చెప్పడం ఎంతవరకూ సమంజసమని అంటున్నారు. అదే విధంగా అక్రిడేషన్లు లేకపోతే హెల్త్ కార్డులు అంతకంటే ఉండవు. ఇక కరోనా వంటి కష్ట కాలంలో కూడా జర్నలిస్టులు కష్టపడ్డారు. రోగాన్ని తెచ్చుకుని ప్రాణాలు పోయిన వారు ఎందరో ఉన్నారు ఏ ఒక్కరికీ రూపాయి ఇచ్చిన దాఖలా లేదు. మొతానికి జగన్ సర్కార్ రావాలని కోరిన వారికే ఈ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని కలం వీరులు అంటున్నారు. ఈ ప్రభుత్వం మీద వారు కన్నెర్ర చేస్తున్నారు. చూడాలి మరి పాత్రికేయ లోకంతో పెట్టుకున్న ఏ ప్రభుత్వమూ అధికారంలో నిలవలేదు. జగన్ సర్కార్ కూడా అదే బాటన నడుస్తోందా.
Discussion about this post