ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలో అభివృద్ధి ఏ స్థాయిలో జరుగుతుందో చెప్పాల్సిన పని లేదు. ఆ అభివృద్ధి ఎంతవరకు జరిగిందనేది ప్రజలకు బాగా కనబడుతోంది. అసలు కొత్తగా రాష్ట్రానికి వచ్చిన ఒక్క పరిశ్రమ కనబడదు….అలాగే ఉన్న పరిశ్రమలు వెళ్లిపోయే పరిస్తితి కూడా వచ్చింది. అలాంటిది రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతుందని సిఎం జగన్ గొప్పగా ప్రకటించుకున్నారు.

జగన్ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఇప్పటివరకు 68 మెగా, భారీ పరిశ్రమలు రూ.30,175 కోట్ల పెట్టుబడి పెట్టాయని అవి ఉత్పత్తి కూడా ప్రారంభించాయని. ఈ పరిశ్రమల ద్వారా 46,119 మంది ఉపాధి పొందుతున్నారని చెప్పారు. అలాగే మరో రూ.36,384 కోట్ల పెట్టుబడితో మరో 62 భారీ, మెగా పరిశ్రమలు కూడా ప్రారంభం కాబోతున్నాయని మాట్లాడిన జగన్, వీటిద్వారా 76,916 మందికి రాబోయే రోజుల్లో ఉపాధి లభిస్తుందని చెప్పారు.

అయితే ఇన్ని భారీ పరిశ్రమలు ఏపీకి వచ్చాయంటే….ఏపీ ప్రజలే షాక్ అయ్యేలా ఉన్నారు. అసలు ఈ పరిశ్రమలు ఏంటి? ఎక్కడ ఉన్నాయని అవగాహన రాష్ట్ర ప్రజలకు లేదని పలువురు విశ్లేషకులు మాట్లాడుతున్నారు. పైగా పరిశ్రమలు ఎక్కడ వస్తున్నాయో, మన కళ్లముందే కనిపిస్తున్నాయని, ఉద్యోగ అవకాశాలు కూడా మన కళ్లముందే కనిపిస్తున్నాయని జగన్ సెలవిచ్చారు.

మరి ఆ పరిశ్రమలుగానీ, ఉద్యోగాలు గానీ ప్రజల కళ్ళకు గానీ, ప్రతిపక్షాలకు గానీ ఎందుకు కనిపించడం లేదో జగన్‌కే తెలియాలని అంటున్నారు. పోనీ కళ్ళజోడులు పెట్టుకుని వెతికితే ఏమన్నా అభివృద్ధి కనబడుతుందేమో చూడాలని ప్రతిపక్షాలు సెటైర్లు వేస్తున్నాయి. అసలు ఇన్ని పరిశ్రమలు, ఇంతమందికి ఉద్యోగాలు వచ్చాయని సొంత పార్టీ వాళ్ళకైనా తెలుసా? అని అడుగుతున్నారు. ఏదేమైనా ఎంతో కష్టపడి రాష్ట్రంలో జగన్ చేస్తున్న అభివృద్ధి జనాలకు కనబడకపోవడం శోఛనీయం.

Discussion about this post