కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో అతి పెద్ద పార్టీ. శతాధిక సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రాచీనమైన పార్టీ. అన్ని పార్టీల వేరులూ కాంగ్రెస్ నుంచే వచ్చాయి. ఇక ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ అయితే కాంగ్రెస్ నాయకులనే మొత్తానికి మొత్తం తీసుకుని రాజకీయ కధ నడుపుతోంది. వారంతా విభజన తరువాత వేరే మార్గం లేక జగన్ బాట పట్టారు. ఇపుడు అధికారంలోకి వైసీపీ వచ్చింది. అలాగే రెండేళ్ళ ఏలుబడిలో ఆ పార్టీ రంగూ రుచి వాసనా అన్నీ కూడా చూశారు. ఈ నేపధ్యంలో దేశంలో మారుతున్న రాజకీయ పరిస్థితులను కూడా గమనంలోకి తీసుకుని తెలుగు రాష్ట్రాలలో పార్టీని పునరుజ్జీవింపచేయాలని కాంగ్రెస్ పెద్దలు నడుం బిగిస్తున్నారు.
తెలంగాణాలో రేవంత్ రెడ్డిని పెట్టి అక్కడ గట్టిగానే అధికార పార్టీకి ఝలక్ ఇచ్చారు. ఇక ఏపీలో అలాంటి ప్రయోగమే చేయాలని చూస్తున్నారు. ఏపీలో జగన్ తమ పార్టీ మొత్తాన్ని లాక్కుని వెన్నుపోటు పొడిచాడు అన్న బాధ అయితే కాంగ్రెస్ పెద్దల్లో ఉంది. దాంతో ఇది సరైన సమయం, జగన్ని వీక్ చేయడానికి అన్నట్లుగా కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్స్ ఉన్నాయట. ఇక ఏపీ మీద కాంగ్రెస్ పెద్దలు గట్టిగానే దృష్టి పెట్టారని చెబుతున్నారు. కాంగ్రెస్ ఏపీలో బలం పుంజుకోవడానికి వరసగా అనేక అస్త్రాలను బయటకు తీస్తుంది అంటున్నారు.
అందులో మొదటిగా ఘర్ వాపసీ నినాదంతో కాంగ్రెస్ ఏపీలో దూసుకుపోవడానికి రెడీ అవుతుంది అంటున్నారు. అంటే వైసీపీలో ఉన్న కాంగ్రెస్ నాయకులను మర్యాదగా మంచిగా పిలవడం అన్న మాట. వారంతా వస్తే కాంగ్రెస్ లో పూర్వ వైభవం కల్పిస్తామని, వారికి అన్ని రకాలుగా రాజకీయ అధికార అవకాశాలు ఇస్తామని కాంగ్రెస్ చెప్పబోతోందిట. మరి ఇది కనుక సక్సెస్ అయితే వైసీపీ నుంచి బయటకు వచ్చే నాయకులు ఎంత మంది ఉంటారో చెప్పలేమనే అంటున్నారు.
Discussion about this post