ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ హవా కొనసాగిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో అన్నీ కార్పొరేషన్ స్థానాల్లో వైసీపీ విజయం సాధించింది. అలాగే టిడిపికి కీలకంగా ఉన్న విజయవాడ కార్పొరేషన్ లో కూడా వైసిపి సత్తా చాటింది. వాస్తవానికి విజయవాడ కార్పొరేషన్ టిడిపి ఖాతాలోనే పడుతుందని అంతా అనుకున్నారు. కానీ టిడిపిలో ఉన్న లుకలుకలు అధికారంలో ఉన్న వైసిపికి కలిసొచ్చాయి. అయితే కార్పొరేషన్ గెలిచిన ఆనందం వైసిపికి ఎక్కువ కాలం నిలబడేలా లేదు. టిడిపి కార్పొరేటర్ల దెబ్బకు వైసీపీకి చుక్కలు కనబడుతున్నాయి. ముఖ్యంగా ఎంపీ కేశినేని నాని కుమార్తె, కార్పొరేటర్ కేశినేని శ్వేత దూకుడుగా వెళుతున్నారు. ప్రజా సమస్యలపై అధికార వైసిపిని గట్టిగానే నిలదీస్తున్నారు. ముఖ్యంగా విజయవాడ కార్పొరేషన్ సమావేశంలో ఆమె స్పీచ్‌లకు వైసీపీకి దిమ్మ తిరిగి బొమ్మ కనపడుతుంది.

ఆమె కౌన్సిల్‌లో అడిగే ప్రశ్నలకు వైసిపికి సౌండ్ ఉండటం లేదు. ముఖ్యంగా ఇటీవల వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 198పై కేశినేని శ్వేత తీవ్రంగా పోరాడుతున్నారు. ఆస్తిపన్ను పంచుతూ ప్రజల నడ్డి విరిచే ఈ జీవోని తక్షణం రద్దు చేయాలని చెప్పి శ్వేత డిమాండ్ చేస్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి తన సహచర టిడిపి కార్పొరేటర్లతో కలిసి, ఆస్తిపన్ను పెంపుపై పోరాటం చేస్తున్నారు. అదే విధంగా తాజాగా కార్పొరేషన్ సమావేశంలో కూడా దీనిపై గళం విప్పారు. ఇక శ్వేత మాట్లాడే మాటలకు వైసీపీ కార్పొరేటర్ల దగ్గర నుంచి సమాధానం రావడం లేదు.

ఎవరైనా మధ్యలో మాట్లాడినా సరే మీ టైం వచ్చినప్పుడు మాట్లాడమని చెప్పి వారికి శ్వేత గట్టిగానే కౌంటర్లు ఇచ్చేస్తున్నారు. ఇలా శ్వేత బెజవాడ పాలిటిక్స్ లో దూకుడు ప్రదర్శిస్తూ వైసీపీని కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. శ్వేత దెబ్బకు వైసిపి కార్పొరేటర్లు కూడా చేతులెత్తేస్తున్నారన్న చర్చ అయితే బెజవాడ రాజకీయాల్లో వినిపిస్తోంది. ఇక వచ్చే ఎన్నికల్లో ఆమె అసెంబ్లీకి పోటీ చేయాలని పట్టుదలతో ఉన్నారు. ఇక తండ్రి నుంచి వచ్చిన రాజకీయ వారసత్వాన్ని అంది పుచ్చుకుని ఆమె బలమైన వాయిస్‌తో రాజకీయాల్లో రాణించే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఉద్దండుల రాజకీయాలకు కేరాఫ్ అయిన బెజవాడ రాజకీయాల్లో కేశినేని శ్వేత ఎంత వరకు వీళ్లను తట్టుకుని నిలబడతారో ? చూడాలి.
Discussion about this post