కేసీయార్ జగన్ ల మధ్య శతృత్వం లేదు స్నేహమే ఉంది అని విపక్షాలు ఇంతకాలం చెప్పాయి. కానీ ఆ మాట వీరంతా అంటే అది రాజకీయంగానే అంతా చూశారు. కానీ ఏకంగా సొంత చెల్లెలు వైఎస్ షర్మిల కూడా మీ ఇద్దరూ మంచి స్నేహితులే కదా అంటూ ఆవిర్భావ సభలో చేసిన హాట్ కామెంట్స్ తో ఇపుడు జగన్ అడ్డంగా దొరికిపోయారు అంటున్నారు. నిజంగా ఇది పవర్ ఫుల్ ఆరోపణగానే చూడాలి. ఇద్దరూ కలసి భోజనాలు చేస్తారు, ముచ్చట్లు పెట్టుకుంటారు. అలాంటిది మీరు ఇద్దరూ కూర్చుని నీటి వివాదాలు పరిష్కరించుకోలేరా అన్న షర్మిల సంధించిన బాణానికి జగన్ విలవిలలాడాల్సిందే అంటున్నారు.
అటు దక్షిణ తెలంగాణా మీద పట్టు సాధించేందుకు కేసీయార్ నీటి వివాదాలకు తెర తీస్తే ఇటు రాయలసీమ మీద రాజకీయ ఆధిక్యత సాధించేందుకు జగన్ చూశారు. ఇలా ఇద్దరికీ లాభదాయకంగా నీటి వివాదానికి అర్జంటుగా తెరలేపారని అంటున్నారు. అందుకే జగన్ లేఖలతోనే సరిపెడుతున్నారు అన్న మాట కూడా ఉంది. నిజానికి ఇలాంటి విషయాల్లో ఏ ముఖ్యమంత్రి కూడా క్షణం ఆలస్యం చేయరు. అపెక్స్ కమిటీ కోసం పట్టుపడతారు. ఇంకా తొందర అనుకుంటే కేంద్ర పెద్దల వద్దకు కూడా వెళ్తారు. కానీ జగన్ మాత్రం ఇవేమీ చేయకుండానే మౌనరాగం ఆలపిస్తున్నారు.ఇన్నాళ్ళూ అటూ ఇటూ రాజకీయ నాటకాలే ఆడుతున్నారు అని విపక్షాలు విమర్శలు చేసేవి. దాన్ని కొంతమంది నమ్మినా ఎక్కువ మంది నమ్మకపోవచ్చు. కానీ షర్మిల అనే కొత్త రాజకీయ పాత్ర అక్కడ ప్రవేశించాక ఇపుడు అసలు కధ బయటకు వస్తోంది. అంతే కాదు, షర్మిల ఏ మాత్రం స్పేర్ చేసేలా కనిపించడంలేదు. వీలు దొరికితే అన్నను చెడుగుడు ఆడేలా ఉన్నారు. లంక గుట్టు విభీషణుడికి తెలిసినట్లుగా షర్మిల రాబోయే రోజుల్లో ఒక్కో విషయాన్ని ఇలా బయటపెడితే మాత్రం జగన్ ఇమేజ్ డ్యామేజ్ కావడం ఖాయమే అంటున్నారు.
నిజానికి షర్మిల పార్టీ వల్ల కేసీయార్ కి పెద్దగా రాజకీయ నష్టం లేకపోయినా జగన్ కి మాత్రం అతి పెద్ద దెబ్బ అవుతుంది అంటున్నారు. ఆమె 2012 నుంచి ఏపీలో వైసీపీకి స్టార్ కాంపెయినర్ గా ఉన్నారు. అటువంటి ఆమె పట్ల జనాల్లో కూడా ఆదరణ ఉంది. అందువల్ల షర్మిల అక్కడ గొంతు పెంచితే రివర్స్ లో ఇక్కడ జగన్ పార్టీకే డ్యామేజ్ అవుతుంది అన్న వాదన అయితే గట్టిగానే ఉంది మరి.
Discussion about this post