కేసీయార్ తో జగన్ కి లాలూచీ ఉందని విపక్షాలు అంటాయి. అయితే పేచీ మాత్రం ఉండదని వైసీపీ నేతల మాటలను చూస్తే అర్ధమైపోతుంది. ఒకవైపు క్రిష్ణా నది మీద అడ్డగోలుగా అక్రమ నీటి ప్రాజెక్టులు కట్టుకోవడానికి కేసీయార్ సర్కార్ రెడీ అయిపోతోంది. మరో వైపు చూస్తే రాయలసీమలో వరద నీటిని మాత్రమే ఉపయోగించుకుంటామని చెబుతూ జగన్ సర్కార్ రాయల సీమ ఎత్తి పోతల పధకానికి శ్రీకారం చుట్టింది. తిప్పి తిప్పి కొడితే ఇవి మూడు టీఎంసీల నీరు మాత్రమే. అటు వైపు ఈ వంక చూపించి ఏకంగా ఎనిమిది ప్రాజెక్టులు అక్రమంగా కట్టడానికి కేసీయార్ సర్కార్ రెడీ అవుతోంది. అవన్నీ పూర్తి అయితే యాభై నుంచి అరవై టీఎంసీల నీటిని క్రిష్ణా నది నుంచి అక్రమంగా తరలించుకుపోతారని లెక్కలు ఉన్నాయి.
మరి రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని చెప్పుకునే జగన్ మాత్రం కేసీయార్ సర్కార్ ని పల్లెత్తు మాట అనడంలేదు. పైగా తెలంగాణా సర్కార్ ని అంటే అక్కడ మన ప్రజలు ఉన్నారని, వారికి ఇబ్బంది అవుతుందని చెబుతున్న మాటలు నమ్మదగిన విధంగా లేవు. తెలంగాణాలో ఆంధ్రా ప్రజలు ఉన్నది ఇవాళా నిన్నా నుంచి కాదు, నిజాం కాలం నుంచి కూడా వారు నివసిస్తున్నారు. తల్లీ తోడుగా వారు కలిసే ఉంటున్నారు. సామాన్యుల మీద ఒక్క చర్య జరిగినట్లుగా ఏడేళ్ళ టీయారెస్ పాలనలో కూడా రుజువు కాలేదు. అటువంటిది కొత్తగా జగన్ తెలంగాణాలోని ఆంధ్రుల విషయంలో లేని పోని భయాలు సృష్టించి ఆందోళన వ్యక్తం చేయడం అంటే విడ్డూరమే అంటున్నారు.అంటే కేసీయార్ సర్కార్ ని గట్టిగా నిలదీయలేకనే ఇలాంటి డొంక తిరుగుడు మాటలను ఏపీ సర్కార్ మాట్లాడుతోందని అంటున్నారు. నిజంగా జగన్ కి రాష్ట్ర ప్రయోజనాల మీద చిత్తశుద్ధి ఉంటే క్రిష్ణా రివర్ బోర్డుకి లేఖలు రాస్తూ కూర్చోకుండా తమ మంత్రుల బృందాన్ని పంపించి తెలంగాణా మీద డైరెక్ట్ యాక్షన్ కి డిమాండ్ చేసేవారని అంటున్నారు. ఇపుడు కూడా చూస్తే జూన్ నెల నుంచి ఏకంగా యాభై టీఎంసీల నీటిని క్రిష్ణా నది నుంచి అక్రమంగా తమ జల విద్యుత్ ప్రాజెక్ట్ కోసం తెలంగాణా సర్కార్ తోడుకుని పోతూంటే కూడా జగన్ సర్కార్ కిమ్మనకపోవడం బట్టి చూస్తూంటే కేసీయార్ ని ఢీ కొట్టలేకనే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు అంటున్నారు.
మరో వైపు కేసీయార్, జగన్ ల మధ్య ఏ గొడవా లేదని, ఇద్దరూ అన్నదమ్ములే అని టీడీపీ ఎంపీ కేశినేని నాని అంటూంటే, ఆస్తుల రక్షణ కోసమే జగన్ కేసీయార్ మీద నోరు ఎత్తడం లేదని మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ఆరోపిస్తున్నారు. మొత్తానికి ఏపీ ప్రయోజనాలను కాపాడే విషయంలో జగన్ సర్కార్ తాత్సార వైఖరి మాత్రం సందేహాస్పదంగానే ఉంది అంటున్నాయి విపక్షాలు.
Discussion about this post