కేఈ కృష్ణమూర్తి ఏపీ రాజకీయాల్లో సీనియర్ నాయకుడు. దశాబ్దాల కాలం నుంచి టీడీపీలో పనిచేస్తున్న నేత. కర్నూలులో టీడీపీకి పెద్ద దిక్కు. ఇక్కడ పార్టీకి ఎప్పుడు అండగా ఉంటూ వస్తున్న కేఈ ఇప్పుడు పూర్తిగా పార్టీలో కనిపించడం తగ్గించేశారు. పార్టీ కష్టాల్లో ఉన్న సమయంలో కూడా బయటకు రావడం లేదు. అటు కేఈ సోదరులు ప్రతాప్, ప్రభాకర్‌లు సైతం పార్టీలో కనిపించడం లేదు. అలాగే కేఈ వారసుడు కేఈ శ్యామ్ సైతం పార్టీ కోసం పనిచేస్తున్నట్లు లేరు.

ఇలా కేఈ ఫ్యామిలీ కర్నూలు రాజకీయాల్లో ఒక్కసారిగా అడ్రెస్ లేకుండా వెళ్ళిపోయారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు బయటకొచ్చి పార్టీని ఆదుకునే కార్యక్రమం చేయడం లేదు. అయితే కేఈ ఫ్యామిలీ ఇలా సైలెంట్‌గా ఉండటానికి కారణాలు తెలియడం లేదు. కాకపోతే టీడీపీ అధిష్టానంపై కేఈ ఫ్యామిలీ అసంతృప్తిగా ఉందని అందుకే బయటకు రావడం లేదని కథనాలు వస్తున్నాయి.

అయినా కేఈ ఫ్యామిలీ అసంతృప్తిగా ఉండటానికి చంద్రబాబు ఎప్పుడు, ఆ ఫ్యామిలీకి అన్యాయం చేయలేదు. ఎప్పుడు కేఈ ఫ్యామిలీకి ప్రాధాన్యత ఇస్తూనే వచ్చారు. గతంలో అధికారంలో ఉండగా కేఈకి మంత్రి పదవితో పాటు, డిప్యూటీ సీఎం హోదా కూడా ఇచ్చారు. అలాగే పత్తికొండ, డోన్ సీట్లు వారికే కేటాయించారు. అయితే దశాబ్దాల పాటు ప్రత్యర్ధిగా ఉన్న కోట్ల ఫ్యామీలీని టిడిపిలోకి తీసుకురావడమే కేఈ అసంతృప్తికి కారణమని ప్రచారం జరుగుతుంది.

కానీ ఇక్కడ కేఈ ఫ్యామిలీకి, కోట్ల ఫ్యామిలీకి సీట్ల విషయంలో క్లాష్ లేదు. అలాంటిది కేఈ ఫ్యామిలీ ఎందుకు టీడీపీకి దూరంగా ఉందో అర్ధం కావట్లేదని కర్నూలు తెలుగు తమ్ముళ్ళు ఆవేదన చెందుతున్నారు. ఇప్పుడుప్పుడే పార్టీ పికప్ అవుతున్న సమయంలో కేఈ ఫ్యామిలీ కూడా బయటకొచ్చి, చంద్రబాబుకు మద్ధతు ఇస్తే పార్టీకి మరింత బెనిఫిట్ అవుతుందని అంటున్నారు. మరి చూడాలి కేఈ ఫ్యామిలీ టీడీపీలో ఎప్పుడు యాక్టివ్ అవుతుందో?

Discussion about this post