ఏపీ మంత్రి కొడాలి నాని రాజకీయ శైలి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆయన ఏ స్థాయిలో ప్రతిపక్ష టీడీపీపై విమర్శలు చేస్తారో కూడా తెలుసు. ముఖ్యంగా చంద్రబాబు, లోకేష్‌లంటే ఒంటికాలిపై వెళ్తారు. పరుషపదజాలంతో మరీ విమర్శలు చేస్తారు. రాజకీయంగా ఇలా దూకుడుగా ఉండే కొడాలి మంత్రిగా, ఎమ్మెల్యేగా కూడా దూకుడుగా ఉంటున్నారా? అంటే చెప్పడం కష్టమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మంత్రిగా పనితీరు పక్కనబెడితే వరుసగా నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలిచిన నాని, గుడివాడలో కొత్తగా చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఏమన్నా ఉన్నాయా అంటే? ఏదో ప్రభుత్వం తరుపున జరిగే కార్యక్రమాలు తప్ప, కొత్తగా నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాలు లేవనే అంటున్నారు.

గతంలో నాని మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా ప్రతిపక్షంలోనే ఉన్నారు. అందుకే నియోజకవర్గాన్ని పెద్దగా అభివృద్ధి చేయలేదని చెబుతారు. కానీ గత ఎన్నికల్లో నాలుగోసారి గెలిచిన నానికి తొలిసారి అధికారం దక్కింది. అలాగే మంత్రి పదవి కూడా వచ్చింది. మరి అధికారంలో ఉండి గుడివాడకు నాని కొత్తగా చేసిన కార్యక్రమాలు కనిపించడం లేదు. ప్రభుత్వం తరుపున పథకాలు, నాడు-నేడు, జగనన్న కాలనీలు ఇలాంటివి మామూలుగానే జరుగుతున్నాయి. కానీ నియోజకవర్గంలో పలు గ్రామాల్లో రోడ్లు బాగా దెబ్బతిన్నాయి. వాటిని అభివృద్ధి చేసే కార్యక్రమం చేయడం లేదు.

అలాగే కొన్ని గ్రామాలకు తాగునీటి సరఫరా అందివ్వడంలో విఫలమవుతున్నారు. అయితే గుడివాడలో కొత్తగా బస్టాండ్ కట్టించే కార్యక్రమం ఒకటి జరుగుతుంది. అటు చిన్నాచితక పరిశ్రమలు లాంటివి గుడివాడలో రాలేదు. ఇక గతంలో కంటే ఇప్పుడు నాని ప్రజలకు అందుబాటులో ఉండటం తక్కువ అనే ప్రచారం ఉంది. ఇక మంత్రి అయ్యాక ఆయన మాటతీరు చాలా దారుణంగా ఉండటంతో న్యూట్రల్‌గా ఉండేవారు, వైసీపీకి వ్యతిరేకంగా మారుతున్నారు. ఈ అంశాలన్నీ కొడాలికి మైనస్ అవుతున్నాయి. కానీ ఇక్కడ ప్రత్యర్ధిగా ఉన్న టీడీపీ సరిగ్గా లేకపోవడమే…కొడాలి అతి పెద్ద ప్లస్.
Discussion about this post