ఏపీలో కొత్త పంతుళ్ళు ఇక ఉండరా. ఉన్న వారితోనే కధ నడిపిస్తారా అంటే ప్రభుత్వ పెద్దల ఆలోచనలు అలాగే ఉన్నాయని అంటున్నారు. నూతన జాతీయ విద్యా విధానం ముసుగులో వేలాది టీచర్ పోస్టులకు వైసీపీ సర్కార్ సర్వ మంగళం పాడేస్తోంది అంటున్నారు. ఏపీలో దాదాపుగా లక్ష దాకా టీచర్ పోస్టులు ఉంటే కనీసం అందులో పదవ వంతు కూడా భర్తీ చేయడానికి జగన్ ప్రభుత్వం సుముఖంగా లేకపోవడంతో కొత్త అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
విపక్ష నేతగా పాదయాత్రలో జగన్ మెగా డీఎస్సీ హామీ ఇచ్చారు. తాను అధికారంలోకి వస్తే ఒకేసారి వేల పోస్టులను భర్తీ చేస్తాను అని కూడా చెప్పుకొచ్చారు. కానీ జగన్ రెండేళ్ళ పాలన ముగిసాక చూసుకుంటే అత్యధిక శాతం అన్యాయం ఉపాధ్యాయ నిరుద్యోగ అభ్యర్ధులకే జరిగింది అంటున్నాయి గణాంకాలు. ఏపీలో ఒక లెక్క ప్రకారం చూస్తే 86 వేల టీచర్ పోస్టులు ఉన్నాయని చెబుతున్నారు. మరి వాటిని దశల వారిగా భర్తీ చేస్తే ఈపాటికి చాలా మంది కొత్త పంతుళ్ళుగా కొలువు చేపట్టేవారు.
అయితే కేంద్రం తీసుకువచ్చిన నూతన విద్యా విధానం ప్రకారం చూస్తే ప్రాధమిక స్థాయిలో చాలా ఉద్యోగాలు ఎగిరిపోతాయి. అదేలా అంటే ఒకటి నుంచి మూడవ తరగతి వరకూ ఉన్న కేటగిరీని తీసుకువచ్చి ప్రీ ప్రైమరీ విభాగంలోకి తెచ్చారు. అంటే నర్సరీ నుంచి మూడవ తరగతి వరకూ ఒక కేటగిరీగా ఉంటాయన్న మాట. వీరందరికీ అంగన్ వాడీ టీచర్లతోనే పాఠాలు చెప్పించాలని ప్రభుత్వం చూస్తోంది. దాంతో కొత్త పోస్టులు ఉన్నా ఇచ్చేది సున్నా అని తేలుతోంది.
అలాగే నాలుగు అయిదు తరగతులను తీసుకెళ్ళి ఎలిమెంటరీలో కలిపేస్తున్నారు. దాంతో మిగిలిన టీచర్లతోనే వీరికి పాఠాలు చెప్పించేస్తారు. అపుడు కొత్త పోస్టుల అవసరం ఉండదు. ఈ విధంగా చేయడం వల్ల చాలా ఖాళీలను భర్తీ చేయాల్సిన అవసరం ఉండదు అని సర్కార్ భావిస్తోందిట. దాంతో వేలాది పోస్టులకు కొత్త పంతుళ్ళ అవసరం ఉండదు అని కూడా అంటున్నారు. మరి ఏపీ జిల్లాలలో కొత్త డీఎస్సీ కోసం కోచింగ్ సైతం తీసుకుంటూ ఎన్నో ఆశలు పెట్టుకున్న నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్ధులకు ఈ పరిణామాలు చేదుగానే ఉంటున్నాయి.
ఇప్పటికైనా కొత్తగా డీఎస్సీ నిర్వహించి పోటులు నింపాలని వారు కోరుతున్నారు. జగన్ చెప్పినట్లుగా మెగా డీఎస్సీ మాట నిలబెట్టుకోవాలని కూడా ఉపాధ్యామ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పెరిగిన విద్యార్ధులను పరిగణనలోకి తీసుకుంటే కొత్తగా మరింత మంది ఉపాధ్యాయులు అవసరం అవుతారు అని కూడా విద్యావేత్తలు చెబుతున్నారు.
Discussion about this post