కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు రాజకీయంగా అనుకూల పరిస్తితులు ఉండవనే చెప్పొచ్చు. ఇక్కడ మొదట నుంచి కాంగ్రెస్, ఇప్పుడు వైసీపీ హవానే ఎక్కువగా ఉంటుంది. గత రెండు ఎన్నికల్లో కూడా జిల్లాలో వైసీపీ హవా కొనసాగింది. అయితే వైసీపీ హవాని తగ్గించాలని టీడీపీ పెద్దగా ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపించడం లేదు. ఇప్పుడు జిల్లాలో వైసీపీకి పూర్తిగా బలం ఉంది. అదే సమయంలో ఈ రెండేళ్లలో వైసీపీపై వ్యతిరేకత కూడా పెరిగింది. కానీ ఆ వ్యతిరేకతని ఉపయోగించుకుని బలపడలేని స్థితిలో టీడీపీలో ఉంది. ముఖ్యంగా కర్నూలు టీడీపీలో ఉన్న కోట్ల ఫ్యామిలీ పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలు ఏమి చేస్తున్నట్లు కనిపించడం లేదు.

గత ఎన్నికల ముందు కోట్ల ఫ్యామిలీ టీడీపీలోకి వచ్చింది. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి…కర్నూలు ఎంపీగా, కోట్ల సుజాతమ్మ ఆలూరు ఎమ్మెల్యేగా పోటీ చేసి జగన్ వేవ్‌లో ఓడిపోయారు. ఓడిపోయాక కోట్ల ఫ్యామిలీ పార్టీ తరుపున పెద్దగా పనిచేయట్లేదు. అటు తమ ప్రత్యర్ధులపై వ్యతిరేకత వచ్చిన దాన్ని ఉపయోగించుకునే స్థితిలో కోట్ల ఫ్యామిలీ లేదు. కర్నూలు వైసీపీ ఎంపీగా సంజీవ్ కుమార్ మెరుగైన పనితీరు కనబర్చడం లేదు. రెండేళ్లలోనే ఈయనపై వ్యతిరేకత పెరిగింది. అటు ఆలూరు ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి గుమ్మనూరు జయరాం పరిస్తితి కూడా అంత బాగోలేదు.

ఈయనపై అనేక అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ఆలూరులో సైతం మంత్రిపై వ్యతిరేకత వస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బెంజ్ కారు లంచం తీసుకున్నారని, భూ కబ్జాలు చేశారని, పేకాట క్లబ్బులు నిర్వహిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. దీంతో నెక్స్ట్ ఈయనకు మంత్రి పదవి కూడా పోతుందని, అలాగే ఆలూరులో మళ్ళీ గెలిచే ఛాన్స్ కూడా లేదని ప్రచారం జరుగుతుంది. ఇలాంటి పరిస్తితుల్లో వైసీపీ నేతల మీద వ్యతిరేకతని తమకు అనుకూలంగా మలుచుకుని బలపడాల్సిన కోట్ల ఫ్యామిలీ ఇప్పటికీ సైలెంట్‌గానే ఉంటుంది. ఇకనుంచైనా పార్టీలో యాక్టివ్ అయితే, నెక్స్ట్ ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయి.
Discussion about this post