సీనియార్ రాజకీయ నేత, రాష్ట్రంలో ఒకప్పుడు చక్రం తిప్పిన కోటగిరి విద్యధరరావు కుమారుడిగా రాజకీ య రంగ ప్రవేశం చేసిన కోటగిరి శ్రీధర్‌కు ఇప్పుడు సొంతనియోజకవర్గంలోనే సెగ తగులుతోంది. ఆయన పై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. నిజానికి యువకుడు, ఉత్సాహ వంతుడు, విద్యావంతుడు కావడంతో నియోజకవర్గంలో సమస్యలు పరిష్కరిస్తారని.. ప్రజలకు అండగా ఉంటారని .. ఇక్కడి వారు భావించారు. ఈ క్రమంలోనే పార్టీలు మారినా.. వైసీపీ తరఫున పోటీ చేయడంతో.. ఆయనను ఏలూరు ఎంపీగా గెలిపించుకున్నారు.
ఏలూరులో అనేక సమస్యలు ఉన్నాయి. తాగునీటి సమస్య కూడా ఏలూరు నియోజకవర్గాన్ని వెంటాడు తోంది. అదే సమయంలో పోలవరం నిర్వాసితులు, ప్రాజెక్టు నిర్మాణంతోపాటు.. ఈ నియోజకవర్గం పరిధి లోకి వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ పలు సమస్యలు వెంటాడుతున్నాయి. కానీ, ఆయా సమస్య ల పరిష్కారం కోసం.. ఎంపీ ఎక్కడా కృషి చేస్తున్న దాఖలాలు కనిపించడం లేదని అంటున్నారు ఇక్కడి ప్రజలు. గత ఏడాది కరోనా పేరుతో దూరంగా ఉన్నానని చెప్పిన ఎంపీ.. తర్వాత.. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రచారం నిర్వహించారే తప్ప.. తమ సమస్యలను పరిష్కరించడం లేదని చెబుతున్నారు.అదే సమయంలో పెట్టుబడులు, ఇతరత్రా.. రాష్ట్ర అవసరాల కోసం.. అంటూ.. ఢిల్లీలోనే మకాం వేస్తున్న శ్రీధర్ తొలి ఏడాదిలో ఆరేడు నెలలు విదేశీ పర్యటనతోనే కాలం గడిపారు. ఇక, ఆ తర్వాత.. సొంత నియోజకవర్గంలో గుర్తుతెలియని.. అంతుచిక్కని వ్యాధితో ప్రజలు అల్లాడినప్పుడు కూడా ఆయన పట్టించుకోలేదు. ఇక, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల విషయంలో అసలే ఆయన అడ్రస్ లేకుండా పోయారని ఇక్కడి వారు చెబుతున్నారు. కరోనాతో తాము అల్లాడుతున్నామని.. ఉపాధి కూడా లేక ఇబ్బందులు పడుతున్నామని ఇక్కడి వారు గగ్గోలు పెడుతున్నారు.
తమ ఎంపీ వస్తే.. ఏదైనా తమకు చేస్తారని.. కూడా వారు ఆశిస్తున్నారు. కానీ, ఎంపీ శ్రీధర్ మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. నియోజకవర్గానికి అడపాదడపా వస్తున్నా.. కేవలం కొంందరికి మాత్రమే దర్శనం ఇస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు కూడా ఆయన ఎక్కువ కాలం అమెరికాలోనే ఉంటుండడంతో స్థానికంగా ఎవ్వరికి అందుబాటులో ఉండడం లేదు. ప్రజలను కలుసుకునేందుకు ఆయన సమయం కేటాయించడం లేదని అంటున్నారు. మరి ఈ పరిణామాలు ఇలానే కొనసాగితే కోటగిరి కోటకు వచ్చే ఎన్నికల్లో బీటలు వారడం ఖాయమే అంటున్నారు.
Discussion about this post