గత ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయాక చాలామంది నాయకులు పార్టీని వీడిన విషయం తెలిసిందే. అలాగే కొందరు నాయకులు జగన్ ప్రభుత్వం దెబ్బకు సైలెంట్ అయిపోయారు. దీంతో ఏపీలో పలు నియోజకవర్గాల్లో టీడీపీకి ఇన్‌చార్జ్‌లు లేకుండా పోయారు. ఈ క్రమంలోనే అధినేత చంద్రబాబు పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. ఇప్పటికే పార్లమెంట్ స్థానాల వారీగా అధ్యక్షులని, సమన్వయకర్తలని నియమించారు. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న నియోజకవర్గాల్లో ఇన్‌చార్జ్‌లని నియమిస్తూ వస్తున్నారు.ఈ క్రమంలోనే పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీకి కంచుకోటగా ఉన్న చింతలపూడి నియోజకవర్గానికి మాజీ మంత్రి పీతల సుజాతని ఇన్‌చార్జ్‌గా నియమించడం దాదాపు ఖరారైపోయిందని తెలుస్తోంది. మరో వారం రోజుల్లో అధినేత నుంచి నిర్ణయం రానుంది.
అయితే సుజాత మొదట నుంచి టీడీపీ కోసం కష్టపడుతూ వస్తున్నారు. పార్టీలో రెండు దశాబ్దాలుగా ఆమె కమిట్‌మెంట్ మహిళా నేతగా ఉన్నారు. 2004లో ప్రభుత్వ ఉద్యోగం వదులుకుని ఆచంట ఎమ్మెల్యేగా వైఎస్ ప్రభంజనాన్ని ఎదురొడ్డి మరీ గెలిచారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో ఆచంట జనరల్ అయ్యింది. అప్పుడు ఆమెకు సీటు రాకపోయినా పార్టీ కోసం కష్టపడ్డారు. తర్వాత 2014లో చింతలపూడి నుంచే ఎమ్మెల్యేగా గెలిచి, చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. అయితే సమీకరణల్లో భాగంగా 2017 ఆమె మంత్రి పదవి పోయింది. అలాగే 2019 ఎన్నికల్లో టికెట్ కూడా రాలేదు. అయినా సరే ఎన్నడూ బాబుపై విమర్శలు చేయలేదు. ఇంకా ఎక్కువగానే పార్టీ కోసం కష్టపడుతూ వచ్చారు.2019 ఎన్నికల్లో సుజాత సీటు రాకపోయినా జిల్లాలో పలు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేశారు. అయితే 2019లో చింతలపూడిలో టీడీపీ తరుపున పోటీ చేసి ఓడిపోయిన కర్రా రాజారావు ఆ మధ్య అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో నియోజకవర్గంలో టీడీపీకి పెద్ద దిక్కు అంటూ లేకుండా పోయింది. దీంతో సుజాత వర్గం కూడా యాక్టివ్ అవుతోంది. కరోనా ఫస్ట్ వేవ్‌కు ముందు నుంచే నియోజకవర్గంలో పార్టీ కేడర్‌కు టచ్‌లోకి వచ్చిన సుజాత ఆపదల్లో ఉన్న కార్యకర్తలను ఆదుకుంటూ వస్తున్నారు.
ఈ క్రమంలోనే నియోజకవర్గంలోనూ, రాష్ట్ర స్థాయిలోనూ పార్టీ తరుపున యాక్టివ్‌గా పనిచేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను సోషల్ మీడియా సాక్షిగా ఉతికి ఆరేస్తున్నారు. జగన్ ప్రభుత్వం చేస్తున్న తప్పులని హైలైట్ చేస్తున్నారు. చంద్రబాబుని విమర్శించిన వారికి గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు. తాజాగా ఖాళీగా ఉన్న నియోజకవర్గాలకు ఇన్‌చార్జ్‌ల భర్తీ క్రమంలోనే సుజాతకు చంద్రబాబు మళ్ళీ చింతలపూడి బాధ్యతలు అప్పగించడం ఖాయమైందని తెలుస్తోంది. గతంలో నియోజకవర్గంలో సుజాత నాయకత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించి ఓ వర్గం నేతలు అంతా ఇప్పుడు గప్‌చుప్ అయిపోయారు.పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు రంకెలు వేసిన నేతలు అంతా ఇప్పుడు రూపాయి ఎందుకు ? ఖర్చు పెట్టుకోవాలని బయటకు రావడమే మానేశారు. ఇక సుజాత మళ్లీ బాధ్యతలు స్వీకరిస్తే అందరిని సమన్వయంతో కలుపుకుని పోతే పార్టీ ఇక్కడ మళ్లీ ట్రాక్‌లోకి ఎక్కడం పెద్ద కష్టమేం కాదు.
Discussion about this post