జగన్ ప్రభుత్వంపై కాపు సామాజికవర్గం నిదానంగా రివర్స్ అవుతున్నట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలో మెజారిటీ ఓటర్లుగా ఉన్న కాపులు, తమ రిజర్వేషన్లు కోసం మళ్ళీ పోరు బాట పడుతున్నారు. రాష్ట్రంలో అత్యధిక ఓట్లు ఉన్న కులం ఏది అంటే…అది కాపులే. వీరు చాలా నియోజకవర్గాల్లో గెలుపోటములని డిసైడ్ చేస్తారు. ఇలా ఎక్కువ సంఖ్యలో ఉన్న కాపులు..తమ రిజర్వేషన్లు కోసం ఎప్పటినుంచో పోరాటం చేస్తూనే ఉన్నారు. తమని బీసీల్లో చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే తమ రిజర్వేషన్లకు హామీ ఇవ్వడంతో 2014లో కాపులు పెద్ద సంఖ్యలో చంద్రబాబుకు మద్ధతు ఇచ్చారు. ఇక తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, కాపు రిజర్వేషన్లపై అసెంబ్లీలో బిల్లు పెట్టి, దాన్ని కేంద్రానికి పంపించారు. కానీ ఆ ప్రక్రియ అక్కడే ఆగిపోయింది. ఆ తర్వాత కేంద్రం అగ్రవర్గాల పేదలకు పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబు దాంట్లో ఐదు శాతం కాపులకు కేటాయించి, మిగిలిన 5 శాతం ఇతర వర్గాలకు ఇచ్చారు.

కానీ జగన్ వచ్చాక పూర్తిగా ఈ రిజర్వేషన్లని రద్దు చేశారు. అయితే మళ్ళీ ఇప్పుడు ఆ పది శాతం అమలు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే తమకు నిర్దేశించిన ఐదు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలంటూ రాష్ట్రంలో ఉండే కాపులు ఆందోళనలు చేయడానికి సిద్ధమయ్యారు. అయితే కాపులని బీసీల్లో చేర్చడం పక్కనబెడితే కనీసం ఆ ఐదు శాతమైన ఇవ్వమని కాపులు డిమాండ్ చేస్తున్నారు.

కానీ జగన్ ప్రభుత్వం ఆ దిశగా అడుగులేసేలా కనిపించడం లేదు. ఇప్పటికే జగన్ ప్రభుత్వం కాపులకు పెద్దగా న్యాయం చేయలేదు. ఇప్పుడు వచ్చిన ఐదు శాతాన్ని కూడా రద్దు చేసేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో జగన్‌కు కాపుల మద్ధతు మరింత తగ్గేలా కనిపిస్తోంది. ఇక రాను రాను జగన్‌కు కాపుల అండ ఉండటం కష్టమే.
Discussion about this post