దేశంలో పెద్ద ఎత్తున ఇళ్ళు కట్టిస్తున్నామని జగన్ గొప్పగా చెప్పుకుంటున్నారు. ఆయన మంత్రులు కూడా అలాగే అర్భాటాలు పోతున్నారు. కానీ నిజానికి జరుగుతున్నదేంటి అంటే సొంత పార్టీలోనే ఆ ఇళ్ళ మీద పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. పెళ్ళి అయిన జంట గట్టిగా కాళ్ళు జాపుకునే విధంగా కూడా ఇంటి నిర్మాణం లేదని ఏకంగా నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గాలి తీసేశారు. నిజానికి దీని మీద విపక్షాలు అంటే ఈ పాటికి దుమారమే లేవదీసే వారు. కానీ అన్నది అధికార పార్టీ సభ్యుడు. మరి దీనికి ఏమని జగన్ సమాధానం చెబుతారు అంటున్నారు ప్రతిపక్షాలు.
ఇళ్ళు అంటే శాశ్వతమైన కార్యక్రమం. ఏదో లెక్కలు చెప్పుకఒవడానికో రికార్డులు బద్ధలు కొట్టడానికో పిచ్చుక గూళ్ళ లాంటివి నిర్మించి మీ బాధ మీరు పడండని జనాలకు పంచే పప్పు బెల్లాల ప్రోగ్రాం కానే కాదు. ఈ ఇళ్ళ కోసం ఏళ్ళూ ఊళ్ళుగా పేదలు ఆశలు పెట్టుకుని ఉన్నారు. మరి వారికి నాణ్యమైన ఇళ్ళు నిర్మించి ఇస్తామని చెప్పిన జగన్ ఆచరణలో మాత్రం చుక్కలే చూపిస్తున్నారు అన్న విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఈ ఇళ్ళ నిర్మాణానికి స్థలాలను పెంచి గదులను విశాలంగా నిర్మించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కూడా డిమాండ్ చేస్తున్నారు.
ఇవన్నీ పక్కన పెడితే ఇంత పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామని, దీనికి అక్షరాలా యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని జగన్ సర్కార్ చెబుతోంది. మరి తాజాగా ఆమోదించిన బడ్జెట్ లో మాత్రం కేవలం అయిదు వేల కోట్లను మాత్రమే కేటాయించింది. ఇది కాదా మోసమని విపక్షాలు అంటున్నాయంటే తప్పు లేదు కదా. యాభై వేల కోట్లు ఎక్కడ. అయిదు వేల కోట్లు ఎక్కడ. పైగా ఈ ఇళ్ల నిర్మాణం కోసం కేంద్రం వాటా గా వచ్చే నిధుల మీదనే ఆధారపడుతున్నారు అన్న విమర్శలు ఉన్నాయి. అంటే రాష్ట్రం నుంచి పెద్దగా ఖర్చు లేకుండానే ప్రచారాన్ని గొప్పగా చేసుకోవడం అన్న మాట. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పేదలకు పక్కా ఇళ్ళ నిర్మాణ విషయంలో కచ్చితమైన విధానంతో అమలు చేయాలని డిమాండ్ వస్తోంది.
Discussion about this post