జల జగడాలలో ఏపీ తెలంగాణా నాయకులు రాజకీయాలు చేద్దామని చూశారన్నది విశ్లేషకుల భావన. ఇపుడు ఆ ఘట్టం కూడా దాటేసింది. ముసుగులు మెల్లగా తీస్తున్నారు. తెలంగాణా సర్కార్ తాజాగా క్రిష్ణా జలాల విషయంలో తన వైఖరి మార్చుకుంది. ముఖ్యమంత్రి కేసీయార్ అయితే క్రిష్ణా నదిలోని 811 టీఎంసీల నికర జలాలలో మా వాటా యాభై శాతం అని కుండ బద్ధలు కొట్టేసారు. మీరు కూడా యాభై శాతం వాటానే తీసుకోవాలి అని ఏపీకి చెబుతున్నారు. అంటే ఇప్పటిదాకా 66 శాతం వాటాతో 500 పైబడి టీఎంసీల నీరు ఏపీకి దక్కేది. ఈ జల జగడం పుణ్యమాని అది కాస్తా 405 టీఎంసీలకు దిగిపోతోంది అన్న మాట. తాజా ప్రతిపాదనలతో క్రిష్ణా రివర్ బోర్డు ముందుకు వెళ్తామని హక్కులను సాధించుకుంటామని కేసీయార్ సర్కార్ గట్టిగానే చెబుతోంది.
మరి ఈ సమయంలో జగన్ చేయాల్సింది చాలానే ఉంది. అంటున్నారు. క్రిష్ణా నదికి అవతల వైపున తెలంగాణా అక్రమంగా ఎనిమిది ప్రాజెక్టులు కట్టబోతోంది అని విపక్ష నేతగా ఉన్నపుడు కర్నూల్ లో జగన్ జలదీక్ష చేశారు. మరిపుడు ఆయన సైలెంట్ అయ్యారు. ఇక కేవలం నాలుగు టీఎంసీల వరద నీటి కోసం తలకెత్తుకున్న రాయలసీమ ఎత్తి పోతల పధకాన్ని చూపిస్తూ కేసీయార్ ఏకంగా క్రిష్ణలో వంద టీఎంసీల నీటికే కోత వేసేలా సరికొత్త ప్లాన్ రచిస్తున్నారు. ఉమ్మడి ఏపీ రెండుగా విభజించాక కొత్తగా నదీ జలాల ఒప్పందాలు జరగాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఆ విధంగా చూస్తే మీరూ మేమూ సమానంగా నీటిని పంచుకోవాలని కూడా ఆయన అంటున్నారు. ఇది ఏ విధంగానూ ఏపీకి సమ్మతం కాదు.ఏకంగా వంద టీఎంసీల నీటిలో కోత వస్తే రాయలసీమ అన్యాయం అయిపోతుంది. కేసీయార్ కి అన్ని విధాలుగా ఇంతకాలం సహకరిస్తూ వచ్చిన జగన్ ఇపుడు నోరు విప్పాలని మేధావులు సహా అంతా కోరుతున్నారు. గోదావరి నది మీద కాళేశ్వరం ప్రాజెక్ట్ ని నిర్మించినపుడు వెళ్ళి మరీ స్నేహ హస్తం అందించిన జగన్ ఇప్పటికే తెలంగాణాకు చాలా చేశారని అంటున్నారు. తాను సీం అయిన రెండవ రోజునే ఏపీ ఆస్తులను తెలంగాణాకు రాసి ఇచ్చారని కూడా విమర్శలు ఉన్నాయి.
ఇపుడు నదీ జలాల వంటి సున్నిత సమస్యను కూడా సైలెంట్ గా ఉంటూ సాచివేత ధోరణితో వ్యవహరిస్తే ఏపీ దారుణంగా నష్టపోతుంది. కేసీయార్ ప్రధానిని కలవడానికి ఢిల్లీ వెళ్తున్నారు. మరి జగన్ అయితే లేఖలు రాసి చేతులు దులుపుకున్నారు అన్న విమర్శలు ఉన్నాయి. జగన్ కనుక గట్టిగా పోరాడక పోతే మాత్రం యాభై శాతం నీళ్ళు కూడా రాకుండా తెలంగాణా ప్రాజెక్టుకు కట్టడం ఖాయమని అంటున్నారు. మరి కేసీయార్ మీద సమరానికి జగన్ రెడీనా..!
Discussion about this post