వైసీపీలో అసమ్మతి పైకి కనిపించడం లేదు కానీ లోలోపల రగులుతున్న అగ్ని పర్వతమే అంటున్నారు. ఎన్నో ఆశలు మరెన్నో బాసలు అన్నీ కలసి నాయకులు వైసీపీ జెండా మోశారు. అందరి కృషి ఫలించి వైసీపీ అధికారంలోకి వచ్చింది. అయితే మాకు ఏమి దక్కింది అన్నదే పార్టీ నేతల బాధ. వైసీపీలో మంత్రి పదవుల మీద మోజు చాలా మందికి ఉందన్న సంగతి విధితమే.
జగన్ని పక్కన పెడితే ఆ పార్టీకి 150 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో పాతిక మందికి మొదటి విడతలో మంత్రి పదవులు దక్కాయి. వీరందరికీ విస్తరణలో తీసేయడం జగన్ వల్ల కూడా కాదు, ఎందుకంటే కొంతమంది సీనియర్లు కంటిన్యూ కావాల్సిందే. అలా చిత్తూరు జిల్లా నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విజయనగరం నుంచి బొత్స సత్యనారాయణ, ప్రకాశం నుంచి బాలినేని శ్రీనివాసులురెడ్డి, నెల్లూరు నుంచి మేకపాటి గౌతం రెడ్డి వంటి వారు ఉంటారు. ఇలా ఒక అరడజన్ మందిని పక్కన పెడితే మరో పందొమ్మిది మందికి మాత్రమే కొత్తగా పదవులు దక్కే చాన్స్ ఉంది.
అవతల వైపు చూసుకుంటే 125 మంది వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు. వీరే కాదు, శాసనమండలిలో వైసీపీకి 20 మంది దాకా సభ్యులు ఉన్నారు. వీరిలో కూడా చాలా మంది మంత్రి పదవుల మీద ఆశలు పెట్టుకున్నారు. అంటే టోటల్ గా 140 మంది దాకా మంత్రి పదవులు ఆశిస్తున్నారు అంటూ తేలిన లెక్క. మరి ఇందులో ఇరవై మందిని ఎంపిక చేయడం అంటే జగన్ కి కత్తి మీద సాము లాంటి వ్యవహారమే అంటున్నారు. ఇందులో సామాజిక సమీకరణలు, ప్రాంతాలు, ఇతర లెక్కలు అన్నీ కూడా కూడితే చాలా మందికి అన్యాయం జరిగిపోతుంది.
మరి ఈసారి అలాంటి అన్యాయాం జరిగితే తట్టుకోగలరా అన్నదే ఇక్కడ ప్రశ్న. ఇప్పటికే వైసీపీలో చాలా మంది మంత్రి వర్గ విస్తరణ అన్నది తమ రాజకీయ భవిష్యత్తుకు కూడా ముహూర్తమని భావిస్తున్నారు. విస్తరణ జరిగి తమకు విస్తరి కనుక వేయకపోతే వైసీపీలో ఎవరూ ఊహించని అతి పెద్ద తిరుగుబాటే వస్తుందని అంటున్నారు. అది బహుశా జగన్ కూడా అంచనా వేయలేరని కూడా వైసీపీలో టాక్ నడుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.
Discussion about this post